Kishan Reddy challenges political parties: కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. సీఏఏ ఏరకంగా ఈ దేశంలో వున్న 130 కోట్ల మందికి నష్టమో బహిరంగ చర్చకు రావాలని ఆయన ఛాలెంజ్ చేశారు. ఢిల్లీలో సోమవారం జరిగిన హింసాత్మక సంఘటనను తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి.. అలాంటి సంఘటనలు జరగడానికి మైనారిటీలను తప్పు దారి పట్టిస్తున్న రాజకీయ పార్టీలే కారణమని ఆరోపించారు.
మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. సీఏఏపై రాంగ్ ప్రాపగాండా చేస్తున్న రాజకీయ పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న వారి వెనక ఎవరున్నా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీ ఘటన ఫెయిల్యూర్ కాదు… ఢిల్లీ పూర్తిగా పోలీసుల కంట్రోల్ లోనే ఉందని చెప్పారు. కేసీఆర్ అండ చూసుకుని అసదుద్దీన్ రెచ్చిపోతున్నారని, కేసీఆర్ పులిమీద కేసీఆర్ స్వారీ చేస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
లక్ష మంది అసదుద్దీన్‌లు అడ్డుపడ్డ సీఏఏని అమలు చేసి తీరుతామన్నారు. సీఏఏతో దేశ ప్రజలకు నష్టం లేదని చెబుతున్నామని, కానీ కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ లాంటి ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడే పార్టీలు సీఏఏపై విషప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఏఏతో దేశప్రజల్లో ఏ ఒక్కరికీ లేదన్న కిషన్ రెడ్డి.. 130 కోట్ల మంది భారతీయుల్లో ఎవరికి నష్టం కలుగుతుందో నిరూపించాని రాజకీయపార్టీలకు సవాల్ విసిరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ పంపుతారని దిగజారుడు ప్రచారం చేస్తున్నారని, మైనారిటీ ప్రజలు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కిషన్ రెడ్డి కోరారు.
ఒక చేతితో జాతీయ జెండా పట్టుకుని.. మరో చేతితో రాళ్ళ దాడి చేయిస్తారా అంటూ నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి. ఎవరు హింసకు పాల్పడినా సహించేది లేదని, సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 2 నెలలుగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటిస్తున్న సంగతి గుర్తించాలని, ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని, రెచ్చగొట్టే భాష మాట్లాడవద్దని సూచించారు కిషన్ రెడ్డి.
Also read: Chandrababu anger on Jagan govt జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం