
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయిసాయి రెడ్డిల మధ్య ప్రమాణాల సవాళ్ళు పీక్ లెవెల్‌కు చేరాయి. కన్నా టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద 20 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారన్న విజయసాయి రెడ్డి తన ఆరోపణను మంగళవారం మరోసారి పునరుద్ఘాటించారు. దానికి అంబటి రాంబాబు మరింత కలరిచ్చారు.
20 కోట్ల ముడుపులకు మరో నాలుగు అంశాలను జోడించి కన్నాకు దమ్ముంటే ఈ అయిదు అంశాలపై దేవుని మీద ప్రమాణానికి సిద్దం కావాలని సవాల్ చేశారు. మరోవైపు వైసీపీ నేతల మాటలు ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్న ఆరోపణలేనని కన్నా రివర్స్ అటాక్ ఇచ్చారు. సవాల్ సై అన్న విజయసాయి మాట మీద నిలబడాలని, లాక్ డౌన్ ముగిసిన వెంటనే ప్రమాణానికి తేదీ ఖరారు చేసుకుందామని అన్నారాయన.
కన్నా, విజయసాయిల మధ్య సోమవారం మొదలైన మాటలు, విమర్శలు, ఆరోపణలు మంగళవారం కూడా కొనసాగాయి. కన్నా సోమవారం చేసిన ప్రమాణం సవాలుపై విజయసాయి స్పందించారు. చంద్రబాబు దగ్గర కన్నా 20 కోట్ల రూపాయలు తీసుకున్నారని మళ్ళీ మళ్ళీ అంటున్నానంటూ కన్నాను మరింత రెచ్చగొట్టారు విజయసాయి. కాణిపాకం వినాయకుని వద్ద కాదు.. ఏకంగా తిరుమల శ్రీ వేంకటేశుని మీద ప్రమాణానికి కూడా సిద్దమని, అందుకు కన్నా కూడా రెడీనా అంటూ సవాల్ విసిరారాయన.
విజయసాయికి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా జత కలిశారు. 20 కోట్ల రూపాయల ఆరోపణలతో మరో నాలుగు అంశాలను జోడించి.. మొత్తం అయిదు అంశాలపై ప్రమాణానికి కన్నా రెడీ కావాలని సవాల్ చేశారు అంబటి. ‘‘ గతంలో గుండె నొప్పి రావడం నిజమేనా? కన్నా ఆస్తులన్నీ నిజాయితీతోనే సంపాదించారా? ఏపీకి ముఖ్యమంత్రి అయ్యేందుకు 20 కోట్ల రూపాయల ముడుపులు ఇవ్వలేదా ? వైసీపీలో చేరేందుకు కన్నా రెడీ కాలేదా?’’ అంటూ నాలుగు ప్రశ్నలను సంధించిన అంబటి.. వాటన్నింటిపై ప్రమాణానికి రావాలని అన్నారు.
విజయసాయిరెడ్డి, రాంబాబుల కామెంట్లపై భగ్గుమన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ‘‘ బీజేపీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు.. ఒక్క ఏడాదిలోనే వైసీపీ గ్రాఫ్ పడిపోయింది.. విజయసాయిరెడ్డి ప్రమాణం చేయటానికి ఒప్పుకోవటం సంతోషం.. నా సవాల్ కు ఒప్పుకున్నారు. దానికి కట్టుబడి ఉండాలి.. లాక్ డౌన్ అవ్వగానే ప్రమాణం చేయటానికి డేట్ నిర్ణయిస్తాను.. వైసీపీ ఎమ్మెల్యే లు వల్లే కరోనా వస్తోంది.. విజయి సాయి వైజాగ్ ఎలా వచ్చాడు? ప్రభుత్వం ఆయన్ని కట్టడి చేయడం లేదా…? ప్రతి వారం కోర్టుకు వెళ్ళి ప్రమాణాలు చేయడం విజయసాయికి అలవాటు.. ’’ అని కన్నా వ్యాఖ్యానించారు.
‘‘ మీరు తప్పు చేశారు కాబట్టే విషయాన్ని తప్పు దారి పట్టిస్తున్నారు.. ఒక పథకం ప్రకారమే ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోంది.. కిట్ల కొనుగోలు ధర ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.. ప్రభుత్వ తప్పులను బయటపెడుతున్నాననే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ప్రభుత్వ ఆలోచన విధానం ప్రజలకు అర్థమవుతుంది.. కేసులు ప్రభుత్వం దాచిపెడుతుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు…’’ అని కన్నా ఆరోపించారు. మొత్తానికి కన్నా, విజయసాయిల ప్రమాణాల సవాళ్ళు లాక్ డౌన్ పీరియడ్‌లో ప్రజలకు మంచి ఆటవిడుపుగా మారాయని పలువురు కామెంట్ చేస్తున్నారు.