రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంత నీటి కరవును తీర్చాలన్న కృత నిశ్చయంతో పని చేస్తున్నానని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దశాబ్దాలుగా సీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నీటి కరవు తాండవిస్తోందని, దానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని తాను భావిస్తున్నానని చెప్పారు సీఎం. కడప జిల్లాలో కుందూ నదిపై నిర్మించ తలపెట్టిన మూడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ సోమవారం నాడు భూమి పూజ చేశారు.
రాయలసీమ నీటి కరువు తీర్చేందుకు కృష్ణానదీ జలాలు సరిపోవని, సీమ కరవు తీరాలంటే గోదావరి జలాల తరలింపు ఒక్కటే శాశ్వత పరిష్కారమని వివరించారు సీఎం జగన్. గోదావరి నదిలో మూడు వేల టిఎంసిల నీరు ఏటా సముద్రం పాలవుతోందని, వాటిని పెన్నా బేసిన్‌కు తరలించాలన్నదే తమ అభిమతమని చెప్పారు జగన్. ఇందుకోసం సుమారు 60 వేల కోట్ల రూపాయలు అవసరమని అన్నారు. ఎంత ఖర్చు అయినా గోదావరి జలాలను పెన్నా బేసిన్‌కు తరలించాలన్న ఉద్దేశంతో పని చేస్తున్నామన్నారు. రెండు, మూడు నెలల్లో ప్రతిపాదనలు రెడీ అవుతాయని, ఆ తర్వాత వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణ పనులకు శ్రీకారం చుడతామని చెప్పారు జగన్.
కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో నెలకొన్న కరవుతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు గోదావరి నీటితో దాహార్తి తీరుతుందని ముఖ్యమంత్రి వివరించారు. తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తోందని చెప్పారాయన. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కేవలం మాటలకే పరిమితమయ్యారంటూ విసుర్లు విసిరారు జగన్.