కరోనా వాక్సిన్… క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు

|

Oct 15, 2020 | 2:47 PM

యావత్ ప్రపంచం ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న కరోనా వాక్సిన్‌ను రూపొందిస్తున్న భారత్ బయోటెక్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. క్లినికల్ ట్రయల్స్‌ను...

కరోనా వాక్సిన్... క్లినికల్ ట్రయల్స్‌లో కీలక మార్పు
Follow us on

Crucial change in clinical trials: యావత్ ప్రపంచం ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న కరోనా వాక్సిన్‌ను రూపొందిస్తున్న భారత్ బయోటెక్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతంగా పూర్తి చేసి.. త్వరగా వాక్సిన్‌ను అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది.

కోవిడ్-19 నిర్మూలన కోసం పరిశోధనలు నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ తొలి దశ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కోవాక్జిన్ పేరిట తయారు చేస్తున్న కరోనా వాక్సిన్ ప్రయోగాలు ప్రస్తుతం రెండో దశలో వున్నాయి. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత వైద్య పరిశోధనా మండలితో కలిసి జరుపుతున్న ఈ ప్రయోగాలలో వినియోగిస్తున్న వాలెంటీర్ల సంఖ్యను సగానికి కుదించింది భారత్ బయోటెక్.

తొలి దశ ప్రయోగాలలో 350 మంది వాలెంటీర్లను వినియోగించిన భారత్ బయోటెక్… రెండో విడత ప్రయోగాల కోసం ఏకంగా 750 మంది వాలెంటీర్లను ఎంపిక చేసుకుంది. అయితే తాజాగా వీరి సంఖ్యను ఏకంగా సగానికి సగం తగ్గించి 380 మంది వాలెంటర్లపైనే ప్రయోగాలు చేయాలని నిర్ణయించింది. దాని వల్ల ప్రయోగాల నిర్వహణలో వేగం పెరుగుతుందని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వాలెంటీర్ల సంఖ్యను కుదించిన భారత్ బయోటెక్ ప్రయోగాలు నిర్వహిస్తున్న ప్రదేశాల సంఖ్యను కూడా తగ్గించుకుంది. తొలి దశ ప్రయోగాలు వయోజనులపై నిర్వహించిన భారత్ బయోటెక్ రెండో దశ ప్రయోగాలను 12 ఏళ్ళు దాటిన బాలురపై కూడా జరపనున్నారు. ఈ రెండు దశల్లో పాల్గొంటున్న వాలెంటీర్లలో ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని పరిశోధన నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇదిలా వుంటే భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా తయారు చేస్తున్న కోవాక్జిన్ వచ్చే సంవత్సరం తొలి భాగంలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం రెండో దశ ప్రయోగాలు నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ మూడో దశ ప్రయోగాలకు కూడా డీజీసీఐ నుంచి అనుమతి పొందింది. అయితే మూడో దశ ప్రారంభించాలంటే రెండో దశకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీసీఐకి అందచేసి ఆమోదింపచేసుకోవాల్సి వుంది.

Also read: సోనుసూద్‌కు అరుదైన అవకాశం.. దానికి గుర్తింపుగానే! 

Also read: సముద్రంలో బోటు గల్లంతు