కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడిపోతోంది. రోజుకో కొత్త లక్షణాలతో జనం కొవిడ్ బారిన పడుతున్నారు. సామాన్యుడి నుంచి సెలబ్రేటీల దాకా ప్రతిఒక్కరు కరోనా దరిచేరుతున్నారు. కరోనా భయంతో టెస్టులు చేయించుకోవాలంటే పెద్ద ప్రయాసగా మారింది. నమూనాలు ఇచ్చి గంటల తరబడి వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు కొత్త కిట్ ను రూపొందించే పనిలో పడ్డారు. ఇంట్లో కూర్చోని కరోనా టెస్ట్ చేసుకునేలా ఫ్లాన్ చేస్తున్నారు. ఇది త్వరలోనే కార్యరూపం దాల్చనుంది.
కరోనా వైరస్ బారినపడినవారిని పరీక్షించేందుకు పరిమితస్థాయిలోనే అనుమతులిచ్చింది ప్రభుత్వం. కొన్ని ఎంపిక చేసిన ల్యాబులు, ఆస్పత్రుల్లోనే టెస్టులు నిర్వహిస్తున్నారు. టెస్టులు పూర్తైనా రోజుల తరబడి పడిగాపులు పడే పరిస్థితి నెలకొంది. అయితే, కరోనా టెస్ట్ కోసం ఆస్పత్రికి, ల్యాబుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే టెస్టులు చేసుకోవచ్చంటున్నారు ఐఐటీ ఢిల్లీ సైంటిస్టులు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ పరిధిలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీ, పుణే సైంటిస్టులు సంయుక్తంగా ఒక ప్రత్యేక టెస్ట్ కిట్ ను రూపొందించే పనిలో పడ్డారు. ఎవరి సాయం లేకుండా ఇంట్లోనే టెస్ట్ చేసుకునేలా ఓ టెస్ట్ కిట్ ను తయారు చేస్తున్నారు. ఇందుకు మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. మరో నెల రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎలీసా ఆధారంగానే ఈ టెస్ట్ కిట్ ను అభివృద్ధి చేస్తున్నారు ఐఐటీ ఢిల్లీ సైంటిస్టులు. ఓ నెలలో ఆ టెస్ట్ కిట్ పనితీరు ఫలితాలు తెలుస్తాయంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే టెస్ట్ కిట్ లో వాడే యాంటీజెన్ల తయారీపై దృష్టి పెడతామంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో లభించే టెస్టు కిట్లతో ఫలితాల కోసం కొన్ని గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని, హోం బేస్డ్ కిట్లతో నిమిషాల్లోనే రిజల్స్ట్ వస్తాయని ఐఐటీ ఢిల్లీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అనురాగ్ రాథోడ్ చెప్పారు. యాంటీజెన్లకు వ్యతిరేకంగా పోరాడే రక్తంలోని ఐజీజీ, ఐజీఎం అనే ఇమ్యునోగ్లోబ్యులిన్ల ఆధారంగా ఈ ఎలీసా టెస్ట్ కిట్ల ప్రాజెక్టును చేపట్టామన్నారు. కొన్ని రకాల ప్రొటీన్లతో కరోనా వైరస్ బలపడుతోందని.. స్పైక్(ఎస్), ఎన్వలప్(ఈ), మెంబ్రేన్(ఎం), న్యూక్లియో క్యాప్సిడ్(ఎన్) ప్రొటీన్లు ఆ వైరస్ కు కీలకమవుతున్నాయని ఆయన వివరించారు. అందులో ఎన్, ఎస్ ప్రోటీన్లే టార్గెట్ గా మేం ఎలీసా టెస్ట్ కిట్ తయారు చేస్తున్నామని.. అంతా సక్సెస్ అయితే టెస్ట్ కిట్లలో కీలకమైన ఎన్, ఎస్ ప్రోటీన్ యాంటీజెన్లను వివిధ కంపెనీలు, ల్యాబుల్లో పెద్దసంఖ్యలో తయారుచేయిస్తామని అనురాగ్ చెప్పారు.