విజయవాడ నగరంతోపాటు శివార్లలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బెజవాడ నగర కమిషనర్ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. మే 3వ తేదీ ఆదివారం నాడు విజయవాడ నగరంలోని అన్ని చికెన్, మటన్, చేపల మార్కెట్లను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శనివారం సాయంత్రం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసులలో ఎక్కువ విజయవాడలోనే నమోదవుతున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం మొత్తం విజయవాడకు దగ్గరలోనే కేంద్రీకృతం అయినా నగరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగి పోవడం ఏమిటని ముఖ్యమంత్రి శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో వ్యాఖ్యానించారు. దాంతో మరిన్ని కఠిన చర్యలకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది.
ముఖ్యంగా సామాజిక దూరాన్ని పాటించాల్సిన చోట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఆదివారం పెద్ద సంఖ్యలో జనం గుమికూడే అవకాశాలు ఉన్న ప్రాంతాలను అధికార యంత్రాంగం గుర్తించింది. అందులో భాగంగా చికెన్, మటన్, ఫిష్ మార్కెట్లపై ఆంక్షలు విధించాలని అధికారులు భావించారు. అయితే జిల్లా కలెక్టర్ సూచన మేరకు నగరంలో ఆదివారం నాడు చికెన్, మటన్, చేపల మార్కెట్లను మూసి ఉంచాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విక్రయాలు కొనసాగిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగర కమిషనర్ హెచ్చరించారు.