బ్రిటిష్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డొరీస్ సైతం కరోనా వైరస్ బారిన పడ్డారు. గత శుక్రవారమే ఆమెకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. వారం రోజులుగా ఆమె బ్రిటన్ పార్లమెంటులో పలువురు సభ్యులతో సన్నిహితంగా మెలిగారు. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇఛ్చిన ఓ విందులో పాల్గొన్నారు. మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకంగా బోరిస్ పలువురు ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా నాడిన్ డొరీస్ వారితో కలిసిమెలిసి సందడి చేశారు. అయితే ఆమెకు ఈ వైరస్ సోకినట్టు తెలియడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆమె ఎవరెవరిని కలిశారో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్ లో తాజాగా కరోనాకు గురై ఆరుగురు మరణించగా.. 382 మందికి ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలుస్తోంది. నాడిన్ డొరీన్ ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారని, క్రమంగా కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. నిజానికి కరోనా అదుపునకు ఓ చట్టాన్ని రూపొందించిన ఈమె.. ఇదే వైరస్ బారిన పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వైరస్ చికిత్సకు సంబంధించి బీమా కంపెనీలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ఫైలుపై ఈమె ఈ మధ్యే సంతకం చేశారు. ఇటలీతో బాటు బ్రిటన్ దేశాన్ని కూడా కరోనా కలవరపాటుకు గురి చేస్తోంది. విమానాశ్రయాలు, జనాలు గుమికూడే బహిరంగ ప్రదేశాల్లో కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.