
పశ్చిమబెంగాల్‌లో జరుగుతోన్న నాలుగో విడత పోలింగ్ హింసాత్మకంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అసాన్‌సోల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అభ్యర్థి బబుల్ సుప్రియో కారు ధ్వంసమైంది. ఘటన సమయంలో సుప్రియో కారులోనే ఉన్నారు. కాగా దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
మరోవైపు ఈ ఘటనపై బబుల్ సుప్రియో స్పందిస్తూ.. ‘‘ఓటేసేందుకు నన్ను ఓటర్లు అనుమతించలేదు. ఇది మన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునేందుకు సిగ్గుగా ఉంది’’ అంటూ పేర్కొన్నారు. అయితే జాతీయ దళాలు వచ్చేవరకు ఓటింగ్‌ను ప్రారంభించకూడదని బీజేపీ కార్యకర్తలు వాదిస్తుండగా.. వారితో సంబంధం లేకుండా పోలింగ్‌ను కొనసాగించాలని టీఎంసీ కార్యకర్తలు పట్టుబట్టారు. దీంతో వారి మధ్య గొడవ ప్రారంభమైంది.