ప్రముఖ పుణ్యకేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణ వేడుకలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది. ఆలయ చిత్రకూట మండపంలో తలంబ్రాలు కలిపే కార్యక్రమంతో నేడు కళ్యాణ పనులు ఆరంభమవుతాయి. ఇందులో భాగంగా 150 క్వింటాళ్ల బియ్యంలో 100 కిలోల ముత్యాలు కలిపి తలంబ్రాలు తయారు చేస్తారు. తలంబ్రాల తయారీకి ఆలయ అధికారులు, పూజారులు 150 క్వింటాళ్ల బియ్యం, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలను సిద్దం చేశారు. రోలు, రోకలికి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పసుపుకొమ్ములు దంచుతారు. కాగా, నేడు స్వామి, అమ్మవార్లకు స్వపన తిరుమంజనం, వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నారు. వివాహ మహోత్సవ ఆరంభ వేడుకల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.