కాంగ్రెస్ వీడి శివసేన గూటికి చేరుతున్న బాలీవుడ్‌ నటి… సీఎం ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో చేరనున్న ఊర్మిళ మటోండ్కర్‌..!

మహారాష్ట్రలో శివసేన పార్టీలోకి మరో నటి చేరబోతుంది. గ్లామరస్ బాలీవుడ్‌ నటి, రంగీలా భామ ఊర్మిళ మటోండ్కర్‌ శివసేన గూటికి చేరనున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 11:11 am, Mon, 30 November 20

మహారాష్ట్రలో శివసేన పార్టీలోకి మరో నటి చేరబోతుంది. గ్లామరస్ బాలీవుడ్‌ నటి, రంగీలా భామ ఊర్మిళ మటోండ్కర్‌ శివసేన గూటికి చేరనున్నారు. మంగళవారం ఆమె పార్టీలో చేరనున్నట్టుగా శివసేన నాయకుడొకరు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఊర్మిళ ఆ తర్వాత అయిదు నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఏడాది తర్వాత తిరిగి రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించారు. ఆమె హఠాత్తుగా శివసేన గూటికి చేరనున్నట్టుగా తెలుస్తోంది.

గత సాధారణ ఎన్నికలకు ముందు ఊర్మిళ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి గోపాల్‌ శెట్టి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పార్టీలో తన పాత్రపై ఆమె తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. పరిమితమైన పాత్రలో ఉండలేనంటూ పార్టీ అధిష్టానానికి ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖ మీడియాలో లీక్‌ కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ శివసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో శివసేనలో చేరుతున్నట్లు తెలిపింది.