బుల్లితెర సెన్సేషనల్ షో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ను రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. 105 రోజుల పాటు సాగిన ఈ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది.
మొదటి నుంచి అంచనాలు లేకుండా షోలోకి అడుగుపెట్టిన రాహుల్.. మెల్లిగా ప్రేక్షకులకు దగ్గరవుతూ ఫైనల్ వరకు చేరాడు. జూలై 21న ప్రారంభమైన ఈ షోలో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా, శివజ్యోతి, వితిక, మహేశ్ విట్టా, పునర్నవి భూపాలం, రవి కృష్ణ, హిమజ, శిల్పా చక్రవర్తి, అషురెడ్డి, రోహిణి, తమన్నా సింహాద్రి, జాఫర్, హేమలు కంటెస్టెంట్లుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళలో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాలు ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. కాగా, చివరికి అత్యధిక ఓట్ల మెజార్టీతో రాహుల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రాహుల్‌కి అత్యధికంగా 35 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. శ్రీముఖికి 28 శాతం, బాబా భాస్కర్‌కు 20%, వరుణ్ సందేశ్‌కు 10%, అలీ రెజాకు 7% ఓటింగ్ వచ్చినట్లుగా సమాచారం.