వినాయకుడికి పొలిటికల్ విఘ్నాలు తొలుగుతాయా?
మంటపాలపై మహా కుట్ర అంటున్న కాషాయదళం
హద్దులు మీరితే కేసులే అంటున్న ప్రభుత్వం
Big News Big Debate: మిగిలిన పండగలు ఆంక్షలు ఉండవు కానీ హిందూ ఉత్సవాలపైనే నిబంధనలా అంటూ ప్రశ్నించారు బీజేపీ నేతలు. మీ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమే ఆంక్షలు పెట్టిందని కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఇంతకీ వినాయకచవితిపై ఎందుకీ దుమారం.. ఎవరి వాదనేంటి?
ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ వినాయక చవితి. అదే వివాదంగా మారితే… అవును సందడిగా సాగాల్సిన పండగ ఏపీలో వివాదాస్పదం అవుతోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ICMR హెచ్చరికల నేపథ్యంలో వైద్యుల సలహాలతో ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయాలనుకుంది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించవద్దని.. ఇళ్లలోనే పండుగ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఊరేగింపులు, నిమజ్జనాలను నిషేధించింది. కేంద్రం గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఇది రాజకీయంగా దుమారం రేపుతోంది.
బీజేపీ యాక్షన్ ప్లాన్..
హిందువులపై జరుగుతున్న దాడేనంటూ కాషాయదళాలు భగ్గుమంటున్నాయి. ఇతర మతాలకు లేని ఆంక్షలు హిందూ పండగలకే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలంటూ కర్నూలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ర్యాలీలు చేపట్టారు. అంతేకాదు వేడుకలను ఎలా అడ్డుకుంటారో చూస్తాం.. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామంటూ సవాల్ విసిరారు కమలనాథులు. ఇందుకు పోలీసుల ఆడియోలు కూడా కొన్ని వినిపిస్తున్నారు.
ప్రభుత్వం రియాక్షన్…
కేంద్రమే ఆంక్షలు పెడితే.. రాష్ట్రాన్ని నిందించడం ఏంటని నిలదీస్తోంది ప్రభుత్వం. దమ్ముంటే బీజేపీ నాయకులు ఢిల్లీలో దీక్షలు చేయాలంటూ సలహా ఇస్తోంది YCP. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని.. ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకునేది లేదంటోంది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్దంగా ధర్నాలు చేసినా అరెస్టు తప్పవని మరీ వార్నింగ్ ఇచ్చింది ఏపీ సర్కార్. గతంలో అన్ని పండగలకు ఆంక్షలు పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. పలు సందర్భాల్లో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆంక్షలు పెడుతూ ఇచ్చిన జీవోలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్నాయని… దేశంలో మూడోస్థానంలో ఏపీ ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
రాజకీయయుద్ధం అలా ఉంటే.. ప్రభుత్వ ఆంక్షలతో సంబంధంలేదన్నట్లు చాలా చోట్ల వేడుకలకు నిర్వహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీసులు వారించినా జనాలు కొన్నిచోట్ల ఆగడం లేదు. కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కొపం అన్నట్లు మారింది. మొత్తానికి వినాయక చవితి వ్యవహారం గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ రంగు పులుముకోవడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఉంది. ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది.. పూర్తి సమాచారం కోసం కింది వీడియో చూడండి.