Representative Image
Image Credit source: TV9 Telugu
పిల్లలకు, విద్యార్థులకు ఏడున్నర ఏళ్ల శని వర్తిస్తుందా? ఒకవేళ వర్తిస్తే ఎటువంటి ఫలితాలు కనిపిస్తాయి? ఎటువంటి సమస్యలు అనుభవానికి వస్తాయి? అర్ధాష్టమి శని, అష్టమ శని వంటివి పిల్లల మీద విద్యార్థుల మీద ఏ విధంగా పనిచేస్తాయి? సాధారణంగా ఇటువంటి ప్రశ్నలు చాలామంది తల్లిదండ్రులకు కలుగుతుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఫలితాలు పిల్లల మీద కూడా ఉంటాయి. వారి జీవితాలను కూడా ఈ దోషాలు ప్రభావితం చేస్తాయి. అయితే, పిల్లలకు ఊహ తెలియనప్పుడు ఈ దోషాల ప్రభావం ఎక్కువగా తల్లిదండ్రుల మీద పడుతుంటుంది. పిల్లలకు ఊహ తెలిసిన తరువాత ఈ దోషాల ప్రభావం పిల్లల మీదే ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లలకు ఊహ తెలిసే వయస్సు 8 సంవత్సరాలు. ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకు ఏలినాటి శని తదితర దోషాలు ప్రారంభం అయినప్పుడు తల్లిదండ్రులు కొద్దిగా అనారోగ్యానికి గురికావడమో, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు పడటమో, ఉద్యోగంలో సమస్యలు తలెత్తడమో జరుగుతుంది. పిల్లలు 8 సంవత్సరాలు దాటిన తర్వాత చదువుల్లో కొద్దిగా వెనుక పడటం, శ్రద్ధాసక్తులు తగ్గటం, ఏకాగ్రత లోపించడం, మధ్య మధ్య అనారోగ్యాలకు గురికావడం వంటివి చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.
శని దోషం అంటే ఏమిటి?
శని గ్రహం ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు. జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి నుంచి 12వ రాశి, ఒకటవ రాశి, రెండవ రాశిలో శని సంచరించడాన్ని ఏలినాటి శని అని వ్యవహరిస్తారు. అదేవిధంగా చంద్రుడు ఉన్న రాశి నుంచి 8 వ రాశిలో శని సంచరించడాన్ని అష్టమ శని అనీ, చంద్రుడు ఉన్న రాశి నుంచి నాలుగో రాశిలో శని సంచరించడాన్ని అర్ధాష్టమ శని అనీ వ్యవహరిస్తారు. ఇందులో ఏలినాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. అష్టమ శని రెండున్నర సంవత్సరాల పాటు, అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది.
పిల్లల మీద వీటికి సంబంధించిన దోషాలు ఎక్కువగా పడే అవకాశం లేదని సారావళి అనే ప్రసిద్ధ ప్రామాణిక జ్యోతిష గ్రంథం చెబుతోంది. సాధారణంగా వీరికి సమస్యలు, బాధ్యతలు, జీవితం పట్ల అవగాహన తక్కువగా ఉండటం వల్ల ఈ దోషాలకు సంబంధించిన ఫలితాలు కూడా తక్కువ స్థాయిలోనే ఉంటాయని ఉత్తర కాలామృతం అనే పురాతన జ్యోతిష గ్రంథం కూడా చెబుతోంది. పెద్దల మీద ఏలినాటి శని తదితర శని దోషాల ప్రభావం ఎక్కువగా ఉండటానికి కారణం వారికి బాధ్యతలు, ఆలోచనలు అవగాహన ఎక్కువగా ఉండటమేనని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
విద్యార్థులపై ప్రభావం
చిన్న పిల్లల దశ కన్నా విద్యార్థి దశ శని దోషాల వల్ల కొద్దిగా ప్రభావితం అవుతుంటుంది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు కొద్దిగా దారి తప్పడానికి, లక్ష్యం నుంచి దృష్టి మరలటానికి, చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రంలో శని శుభగ్రహం అయిన పక్షంలో ఈ దోషాలు పెద్దగా వర్తించవు. అంతేకాక, వృషభం తుల మకరం కుంభరాశులకు చెందిన పిల్లలకు లేదా విద్యార్థులకు శని సంచార ప్రభావం ఎక్కువగా వర్తించదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పిల్లల రాశుల మీద శని సంచారం జరుగుతున్నప్పుడు శనిని దూషించడం కానీ, శని పేరుతో ఇతరులను దూషించడం కానీ చేయకపోవడం మంచిది. శనిని పరోక్షంగా గానీ లేదా ప్రత్యక్షంగా గానీ దూషించే పక్షంలో శని బలం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
పరిహారం ఏమిటి?
తమ రాశుల ప్రకారం లేదా తమ నక్షత్రాల ప్రకారం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఏర్పడినప్పుడు తరచూ శివాలయానికి వెళ్లి శివునికి అర్చన చేయించడం వల్ల శని దోషం తగ్గి మంచి ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంటుంది. శని ఒక్క శివుడికి మాత్రమే లోబడి ఉంటాడని, శివుని ఆదేశాలను మాత్రమే పాటిస్తాడని, శివుని అర్చించినప్పుడే తాను సంతృప్తి చెందుతాడని శాస్త్రం చెబుతోంది. అందు వల్ల జాతకం ప్రకారం గానీ, సంచారం ప్రకారం గానీ శని గ్రహం అనుకూలంగా లేనప్పుడు శివుడికి పూజ చేయించడమే మంచిది. ముఖ్యంగా శనివారం నాడు ఇంట్లోనే శివుడికి పూజ చేయడం లేదా శివ స్తోత్రం చదువుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పిల్లల తరఫున తల్లిదండ్రులు పూజ చేయించినా, అర్చన చేయించినా అదే ఫలితం అనుభవానికి వస్తుంది.