
Telugu Astrology
కొన్ని రాశుల వారికి కొన్ని కలలు ఉంటాయి. ఈ రాశుల వారు వాటిని సాధించుకునే ప్రయత్నం చేస్తారు. మరికొన్ని రాశులవారు కలలు కనడం జరుగుతుంది కానీ, వాటి గురించి పెద్దగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ఏడాది మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారు కొన్ని కోరికలు, ఆశల మీద దృష్టి పెట్టి వాటిని సాధించుకునే ప్రయత్నం చేస్తారు. వారు ఎటువంటి కలలు కంటారు? అవి సాధించుకునే అవకాశం ఉందా? వారి రాశ్యధిపతుల స్థితిగతుల మీద ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆధారపడి ఉంటాయి.
- మేషం: ఈ రాశివారికి రాజయోగ స్థానాలైన కర్కాటక, సింహ రాశుల మీదుగా రాశ్యధిపతి కుజుడు సంచా రం చేస్తున్నందువల్ల ఉన్నత పదవులను చేపట్టడం మీద వీరు కలలు కనే అవకాశం ఉంది. ప్రస్తుతం వారు ఉద్యోగం చేస్తున్న సంస్థలోనే ఈ రాశివారు త్వరలో ఉన్నత పదవిని చేపట్టే అవకాశం ఉంది. జూలైలో వీరు మరో సంస్థలో ఉన్నత పదవి చేపట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా పర్యటనలు చేయడం, విదేశాలకు వెళ్లడం వంటి కోరికలు, ఆశలు కూడా నెరవేరుతాయి.
- వృషభం: ప్రస్తుతం లాభస్థానంలో ఉచ్ఛ స్థితిలో రాశ్యధిపతి శుక్రుడు మున్ముందు తన స్వస్థానమైన వృషభంలోనూ, తర్వాత మిథునంలోనూ సంచారం చేయబోతున్నందువల్ల ఈ రాశివారికి ధన కాంక్ష బాగా పెరిగే అవకాశం ఉంది. ఐశ్వర్యవంతులు కావాలనే వీరి కల ఈ ఏడాది తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా విశేష లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.
- సింహం: సహజ నాయకత్వ లక్షణాలు కలిగిన ఈ రాశివారికి ఒక సంస్థకు అధిపతి కావాలన్న కోరిక కలుగుతుంది. ఒక సంస్థను స్థాపించాలని కూడా కలలు కంటారు. రాశ్యధిపతి రవి మరో మూడు నెలల పాటు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల వీరి కల సాకారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రముఖులతో, పలుకుబడి కలిగినవారితో పరిచయాలు పెంచుకుంటారు. నైపుణ్యాలకు పదును పెడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందే సూచనలు కూడా ఉన్నాయి.
- తుల: వ్యాపార నైపుణ్యాలు కలిగిన ఈ రాశివారికి ప్రస్తుతం రాశ్యదిపతి శుక్రుడు అనుకూలంగా ఉండడంతో పాటు, భాగ్య స్థానంలో గురువు ప్రవేశం వల్ల అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. ఒక వ్యాపార సంస్థను ప్రారంభించడానికి, వ్యాపార సంస్థలో భాగస్వాములు కావడానికి సంబంధించిన వీరి కల తప్పకుండా సాకారం అవుతుంది. ఈ విషయంలో వీరు తమకు అందిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా వీరికి బాగా లాభించే అవకాశం ఉంది.
- ధనుస్సు: రాశ్యధిపతి గురువు ఈ నెలాఖరుతో బాగా అనుకూలంగా మారబోతున్నందువల్ల ఈ రాశివారికి రాజకీయాల్లో లేదా వ్యాపారాల్లో ప్రవేశించాలన్న కోరిక నెరవేరే అవకాశం ఉంది. విద్యారంగంలో ఉన్నత స్థానానికి వెళ్లాలనుకుంటున్న వారి కలలు కూడా సాకారం అవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిసి తిరగడం, ఆర్థికంగా బలం పెరగడం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ఎంత ప్రయత్నిస్తే అంతగా సానుకూల ఫలితాలు కలుగుతాయి. వీరి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది.
- మకరం: ఏలిన్నాటి శని కారణంగా ఏడున్నర ఏళ్లుగా ఎదుగూబొదుగూ లేకుండా ఆగిపోయిన జీవితం ఇకనైనా పురోగతి చెందాలని, గుర్తింపు లభించాలని వీరు ఎక్కువగా కోరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది వీరికి శనీశ్వరుడితో పాటు శుక్ర, బుధుల బలం కూడా లభిస్తున్నందువల్ల ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా, ప్రభుత్వపరంగా కూడా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. పదోన్నతులు కలుగుతాయి.