Shani Gochar 2023: శని గ్రహ సంచారంతో కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. మీ రాశికి ఇలా..

Saturn Transit 2023 Predictions: శనికి మందుడు అని మరో పేరు కూడా ఉంది. శని మందగమనంతో సంచారం చేస్తాడు. ప్రతి రాశిలోనూ 30 నెలల పాటు తిష్ట వేస్తాడు. శని పొగడ్తలకు లొంగిపోతాడని, పాజిటివ్ గా ఉన్నా, క్రమశిక్షణతో వ్యవహరించినా, వినయంగా ప్రవర్తించినా అందలాలు ఎక్కిస్తాడని ప్రతీతి.

Shani Gochar 2023: శని గ్రహ సంచారంతో కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. మీ రాశికి ఇలా..
Shani Graha Gochar 2023
Image Credit source: TV9 Telugu

Edited By: Janardhan Veluru

Updated on: Dec 14, 2022 | 3:30 PM

Saturn Transit 2023 Predictions: వచ్చే ఏడాది జనవరి 18వ తేదీన శని గ్రహం మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ గ్రహం కుంభరాశిలో 2025 మార్చి 31 వరకు ఉండి ఆ తర్వాత మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. కుంభరాశి శనికి మూల త్రికోణ రాశి. అంటే సొంత ఇంటి కన్నా ఎక్కువ. ఇక్కడ శని గ్రహం చాలా బలంగా ఉంటుంది. శని అంటే అందరికీ భయమే కానీ నిజానికి జాతక చక్రంలో శనిని మించిన మంచి గ్రహం మరొకటి లేదు. రాజకీయాలు, సినిమాలు, వ్యాపారం, ఆధ్యాత్మికం, సామాజిక సేవ వంటి రంగాల్లో ఒక వెలుగు జరగాలంటే శని అనుగ్రహం చాలా అవసరం. మహాత్మా గాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, మురార్జీ దేశాయ్, ఇందిరా గాంధీ, ధీరుభాయ్ అంబానీ, చిరంజీవి, ఎన్టీఆర్, పరమాచార్య, రమణ మహర్షి వంటి వారు తమ తమ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారంటే అందుకు శని అనుగ్రహమే కారణమని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు.

శనికి మందుడు అని మరో పేరు కూడా ఉంది. శని మందగమనంతో సంచారం చేస్తాడు. ప్రతి రాశిలోనూ 30 నెలల పాటు తిష్ట వేస్తాడు. శని పొగడ్తలకు లొంగిపోతాడని, పాజిటివ్ గా ఉన్నా, క్రమశిక్షణతో వ్యవహరించినా, వినయంగా ప్రవర్తించినా అందలాలు ఎక్కిస్తాడని ప్రతీతి. తనను తిట్టే వారిని అహంకారం ప్రదర్శించే వారిని ఏమాత్రం క్షమించడని కూడా పేరు ఉంది. శనిని శాంతపరచాలన్నా, తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నా శివుడికి తరచూ అర్చన చేయించడం ఒక్కటే మార్గమని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటివి జరుగుతున్న పక్షంలో జాతకులను శని మరీ ఎక్కువగా పీడించడం జరుగుతుంటుంది. అయితే, జాతక చక్రంలో దశలు, అంతర్దశలు బాగున్నా, గురుదశ నడుస్తున్నా, శుక్ర దశ నడుస్తున్న శని ప్రభావం తక్కువగా ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతుంటారు. ఇంతకూ శని కుంభరాశిలో ప్రవేశించడం వల్ల ఏ ఏ రాశుల వారికి ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం. చిత్రం ఏమిటంటే, శని తన మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ప్రవేశిస్తే ఏ రాశి వారికి అయినా కొద్దో గొప్పో మంచే చేస్తాడని చెబుతారు.

ఇవి కూడా చదవండి

మేషం

ఈ రాశి వారికి శని దశమ, ఏకాదశాధిపతి. ఉద్యోగానికి, ఆదాయానికి, పురోగతికి సంబంధించిన గ్రహం ఇది. జనవరి 18 నుంచి శని ఈ రాశి వారికి 11వ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల ఈ రాశి వారికి ఆదాయం బాగా పెరగబోతుంది. అదృష్టం పండ బోతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. అనేక మార్గాల నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతానయోగం ఉంటుంది. మీ మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. విదేశాల్లో చదువులకు, ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా స్థిరపడతారు.

వృషభం

ఈ రాశి వారికి భాగ్య, రాజ్యాధిపతి అయిన శని పదవ స్థానంలో ప్రవేశించబోతున్నాడు. దీని ఫలితంగా ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా ఊహించని విధంగా విజయాలు సాధించడం ఖాయం. ఉద్యోగ వ్యాపార వృత్తి పనుల మీద విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మీ కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. క్షణం కూడా తీరుబడి లేని పరిస్థితి ఎదురవుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు, దూర ప్రయాణాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఎక్కువవుతాయి. అయితే, కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం మరిచిపోవద్దు. అనవసర పరిచయాలకు, చెడు స్నేహాలకు, వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

మిధునం

ఈ రాశి వారికి శని ఎనిమిది, తొమ్మిదవ రాశులకు అధిపతి. ఎనిమిదవ రాశి నుంచి తొమ్మిదవ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. తొమ్మిదవ రాశి అంటే భాగ్యస్థానం. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలు, అదృష్టం ఈ రాసి లక్షణాలు. అందువల్ల ఈ రాశి వారికి భాగ్యం పెరగబోతోంది. వీసా సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారమై విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. దూర ప్రయాణాలకు మాత్రం బాగా అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి రావటం, తండ్రి వైపు వారితో సంబంధాలు మెరుగుపడటం వంటివి జరుగుతాయి. ఇక ఉద్యోగ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మధ్య మధ్య ధనయోగాలకు అవకాశం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. పరిశోధనలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉన్నత విద్యకు అవకాశం ఉంది.

కర్కాటకం

ఈ రాశి వారికి శని ఏడు, 8 రాశులకి అధిపతి. జనవరి 18 నుంచి ఈ రాశి వారికి శని అష్టమ రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం అవుతుందన్నమాట. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సవాళ్లు ప్రారంభమవుతాయి. ఎంత కష్టపడితే అంత లాభం ఉంటుంది. బద్ధకానికి, సోమరితనానికి అవకాశం ఇవ్వవద్దు. ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అయితే, ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారులు, షేర్లు కొనేవారు, రియల్ ఎస్టేట్ వారు బాగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామి తరఫు బంధువుల నుంచి లబ్ధి పొందుతారు. ప్రేమ వ్యవహారాలు ఒక పట్టాన ముందుకు సాగవు. చదువుల్లో కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగం మారటానికి అవకాశం ఉంది. కొన్ని కుటుంబ, వ్యక్తిగత సమస్యల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.

సింహం

ఈ రాశి వారికి శని 6,  ఏడవ స్థానాలకు అధిపతి. ప్రస్తుతం ఏడవ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వ్యాపారంలో ఉంటే భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. శని జీవన కారకుడు అయినందువల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నమ్మిన వాళ్లు, సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు చదువులోనూ, ఉద్యోగాల్లోనూ స్థిరపడతారు. తల్లిదండ్రుల్లో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు.

కన్య

ఈ రాశి వారికి శని ఐదు, ఆరు స్థానాలకు అధిపతి. శని ఆరవ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు అనుభవానికి వస్తాయి. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అవసరానికి డబ్బు అంది కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. రాదనుకున్న డబ్బు కూడా చేతికి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంకా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతి పనికి ఎక్కువగా కష్టపడాల్సి రావటం వల్ల శరీరం బలహీనపడే అవకాశం ఉంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ధనయోగాలకు అవకాశం లేకపోలేదు. సుఖ సంతోషాలకు లోటు ఉండదు.

తుల

ఈ రాశి వారికి నాలుగు ఐదు స్థానాలకు అధిపతిగా శని అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ రాశి వారికి అర్థాష్టమ శని తొలగి శని పంచమంలో ప్రవేశించడం వల్ల ఎక్కువగా సానుకూల ఫలితాలను ఇస్తుంది. విదేశాల్లో ఉద్యోగం, విదేశాలలో చదువులు, సంతాన అభివృద్ధి, ఆదాయం పెరుగుదల, ఆధ్యాత్మిక చింతన వంటివి అనుభవానికి వస్తాయి. జాతక చక్రం అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ ఏడాది చాలా బాగానే గడిచిపోతుంది చెప్పాలి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలనుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. విదేశీ పర్యటన సూచనలున్నాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. స్నేహితురాలితో ప్రేమ వ్యవహారం పెళ్లికి దారి తీసే అవకాశం ఉంది.

వృశ్చికం

ఈ రాశి వారికి శని మూడు నాలుగు స్థానాలకు అధిపతి. త్వరలో నాలుగో రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంటే ఈ రాశి వారికి అర్థాష్టమ శని ప్రారంభం అవుతోందన్నమాట. ఫలితంగా విపరీతమైన తిప్పట, ప్రతి పని ఆలస్యం కావడం, అనవసర ఖర్చులు, ప్రయాణాలు, ఉద్యోగంలో స్థాన చలనం, సోదరులతో విభేదాలు, ఇరుగుపొరుగుతో సమస్యలు, భార్యకు అనారోగ్యం వంటివి చోటు చేసుకుంటాయి. కోపతాపాలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ విభేదాలకు వాదాలకు దిగవద్దు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. బంధువులతో విభేదాలకు అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక రంగంలోని వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

ధనుస్సు

రెండు మూడు రాశులకు అధిపతి అయిన శని మూడవ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఏలి నాటి శని పేరుతో ఏడున్నర ఏళ్లుగా బాధ పెడుతున్న శని నుంచి ఈ రాశి వారికి విముక్తి లభించబోతోంది. దీనివల్ల పెండింగ్ పనులు పూర్తి కావడం, ఆదాయం పెరుగుదల, వ్యాపార అభివృద్ధి, ప్రమోషన్లు, కొత్త ఉద్యోగం, విదేశీ ప్రయాణం, శుభకార్యాలు, శుభవార్త వంటివి చోటు చేసుకుంటాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలీక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెడతారు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం చాలా బాగుంది. వివాహ సంబంధం కుదురుతుంది.

మకరం

ఈ రాశి వారికి శని ఒకటి రెండు స్థానాలకు అధిపతి. రెండవ స్థానమైన కుంభ రాశిలోకి త్వరలో శని ప్రవేశిస్తున్నాడు. రెండవ స్థానం అంటే కుటుంబం, ధనం, వాక్కు తదితర అంశాలకు సంబంధించిన స్థానం. శనికి ఇది ద్వితీయ రాశి అయినందువల్ల మరో రెండున్నర ఏళ్లపాటు ఈ రాశి వారికి ఏలినాటి శని కొనసాగుతుంది. అయినప్పటికీ శని ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఎక్కువగా  మేలే చేస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతుంటాయి. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి.

కుంభం

పన్నెండు, ఒకటవ రాశులకు అధిపతి అయిన శని ఒకటవ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశి వారికి ఏలినాటి శని కొనసాగుతోంది. దీనివల్ల ప్రతి పని ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తి కలిగిస్తాయి. ఏదో విధంగా ఆస్తుల్ని కొనడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ పూర్తిగా పడక పెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. అనుకోని ఖర్చులు, ఆదాయంలో తగ్గుదల వంటి సమస్యల నుంచి బయటపడతారు. అయితే ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్లు ఆగిపోవచ్చు. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. పని విషయంలో అధికారుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

మీనం

పదకొండు, పన్నెండు రాశులకు అధిపతి అయిన శని 12వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. నష్టానికి ఇల్లు గాని స్థలంగాని అమ్ముకోవాల్సి రావడం, వైద్య ఖర్చులు పెరగటం, పనులు పూర్తి కాకపోవడం, అనవసర ఖర్చులు, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోవడం, ఉద్యోగం పోవడం వంటి సమస్యలు అనుభవానికి వస్తాయి. అయితే కొన్ని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడపటం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్త అందుతుంది. రుణ బాధ తగ్గుతుంది. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు.
(కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు)
మరిన్ని జ్యోతిష్య సంబంధ కథనాలు చదవండి..