Money Astrology: శకట యోగంతో ఈ రాశులు జాగ్రత్త..! వారికి ఆర్థిక అనర్థాలకు అవకాశం

Shakata Yoga: శకట యోగం గురువు చంద్రునికి దుస్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఇది ఆర్థిక ఇబ్బందులను సూచిస్తుంది. గురువు 6, 8, 12 స్థానాల్లో సంచరించినపుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుదల, అనవసర ఖర్చులు, రుణాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఇతర గ్రహాల అనుకూలత దీని ప్రభావాన్ని తగ్గిస్తుంది.

Money Astrology: శకట యోగంతో ఈ రాశులు జాగ్రత్త..! వారికి ఆర్థిక అనర్థాలకు అవకాశం
Shakata Yoga

Edited By: Janardhan Veluru

Updated on: Jun 30, 2025 | 12:19 PM

మీ చంద్రుడికి గురువు దుస్థానంలో ఉన్నప్పుడు శకట యోగం ఏర్పడుతుంది. శకట యోగ మంటే ఆర్థికంగా దుస్థితి కలగడం. మీ చంద్రుడికి గురువు ఆరు, ఎనిమిది, పన్నెండు స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు ఈ శకట యోగం బాగా ఎక్కువగానూ, 3, 4, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు కాస్తంత తక్కువగానూ ఈ శకట యోగం పనిచేస్తుంది. ఆదాయం తగ్గడం, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు పెరగడం, రావలసిన డబ్బు రాకపోవడం, అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉండడం, అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడం ఈ శకట యోగ లక్షణాలు. మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులను ఈ శకట యోగం పీడించే అవకాశం ఉంది. అయితే, ఇతర గ్రహాల అనుకూలత వల్ల ఈ శకట యోగం ప్రభావం తగ్గే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశివారికి గురువు ప్రస్తుతం మూడవ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల, కొద్దిపాటి శకట యోగం ఏర్పడింది. ఆదాయం పెరగాల్సినంత పెరగకపోవచ్చు. శ్రమ ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలుంటాయి. రావలసిన సొమ్ము చేతికి అందదు. చేతిలో ఉన్న డబ్బు ఖర్చయిపోతుంటుంది. ఆర్థిక సాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది.
  2. కర్కాటకం: ఈ రాశికి 12వ స్థానంలో గురు సంచారం వల్ల శకట యోగం ఏర్పడింది. దీనివల్ల ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వైద్య ఖర్చులు, దైవ కార్యాలపై ఖర్చులు కూడా వీటికి తోడవుతాయి. ఎవరికైనా ఆర్థిక సహాయం చేసే పక్షంలో అది తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థికంగా మోసపోయే సూచనలు కూడా ఉన్నాయి. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది.
  3. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురు సంచారం వల్ల తగ్గుస్థాయి శకట యోగం పట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగకపోవడం, జూనియర్లకు పదోన్నతులు లభించడం, వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు మందగించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం బాగా పెరిగి విశ్రాంతి కరువవుతుంది. బంధుమిత్రుల వల్ల నిందలు పడాల్సి వస్తుంది. అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత శ్రమపడినా చేతిలో డబ్బు నిలవదు. ఆర్థిక సమస్యల ఒత్తిడి కొనసాగుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల పూర్తి స్థాయిలో శకట యోగం ఏర్పడింది. ఆదా యం కోసం బాగా శ్రమపడాల్సి వస్తుంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు బాగా పెరుగుతాయి. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు, ప్రయత్నాల్లో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా మందగిస్తుంది.
  5. మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో గురు సంచారం వల్ల పూర్తి స్థాయి శకట యోగం ఏర్పడింది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. డబ్బు నష్టపోవడం, మోసపోవడం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో లాభించకపోవచ్చు. ప్రయాణాల్లో కూడా నష్టపోవడం జరుగుతుంది. ఉద్యోగులు దూర ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
  6. మీనం: ఈ రాశికి నాలుగవ స్థానంలో గురు సంచారం వల్ల తక్కువ స్థాయిలో శకట యోగం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో మోస పోవడానికి, నష్టపోవడానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆశించిన లాభాలు కలగకపోవచ్చు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ మిగులుతుంది. ప్రయాణాల వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. వైద్య ఖర్చులు పెరుగుతాయి.