మూడు గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి ఆదాయ వృద్ధి, పదోన్నతులు..!
కుంభ రాశిలో రాహు, బుధ, కుజులు.. మీన రాశిలో రవి, శుక్ర, శని సంచారం వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. దీని ప్రభావంతో వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి ఏప్రిల్ మొదటి వారం వరకు ఆదాయం, పదోన్నతి, కీర్తి, ఆస్తి లాభాలను అందించే శుభకాలంగా నిలుస్తుంది.
ప్రస్తుతం కుంభరాశిలో రాహు, బుధ, కుజులు, మీన రాశిలో రవి, శుక్ర, శనులు సంచారం చేయడం జరుగుతోంది. ఎంతో అరుదుగా ఈ జరిగే ఈ రకమైన మూడు గ్రహాల యుతి వల్ల కొన్ని రాశులకు రాజయోగాలను, భాగ్య యోగాలను కలిగే అవకాశం ఉంది. సాధారణంగా మూడు గ్రహాలు ఒక రాశిలో చేరినప్పుడు పోటీ పోటీగా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా రెండు రాశుల్లో త్రిగ్రాహి యోగం ఏర్పడడం వల్ల వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి ఆదాయ వృద్ధి, పదోన్నతులు, కీర్తి ప్రతిష్ఠలు, ఆస్తి లాభం, భూ లాభం వంటివి కలుగుతాయి. ఈ యోగాలు ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగుతాయి.
వృషభం: దశమ, లాభ స్థానాల్లో చోటు చేసుకున్న రెండు త్రిగ్రాహి యోగాల వల్ల ఈ రాశి వారు వ్యక్తిగతం గానూ, కెరీర్ పరంగానూ మంచి అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తప్పకుండా ఆర్థిక స్థిరత్వం లభి స్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. అనేక విధాలైన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి.
మిథునం: ఈ రాశికి నవమ, దశమ స్థానాల్లో మూడు గ్రహాల సంచారం వల్ల ఉద్యోగంలో రాజయోగాలు, ధన యోగాలు ఎక్కువగా కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆస్తి లాభాలు, భూలాభాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఆస్తి విలువ పెరిగే సూచనలున్నాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన ఆఫర్లు అందుతాయి. అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది.
తుల: ఈ రాశికి అయిదు, ఆరు స్థానాల్లో త్రిగ్రాహి యోగాలు ఏర్పడడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా అదృష్టం తలుపు తడుతుంది. విదేశీయానానికి సంబంధించిన అవకాశాలు పెరుగుతాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. విదేశాల్లో స్థిరత్వం సంపాదించుకుంటారు. పిల్లలకు ఉన్నత విద్యల్లో అవకాశాలు లభిస్తాయి. వారసత్వ సంపద కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. తండ్రి నుంచి అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ ఆఫర్లు అందుతాయి.
ధనుస్సు: ఈ రాశికి మూడు, నాలుగు స్థానాల్లో మూడు చొప్పున గ్రహాలు కలవడం వల్ల విపరీత రాజ యోగాలు కలుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అప్రయత్న ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ రాశివారిదే పైచేయిగా ఉంటుంది. ఇంటా బయటా మాట చెలామణీ అవుతుంది. లాటరీలు, షేర్లు, వడ్డీ వ్యాపారం, ఆర్థిక లావాదేవీల వంటి వాటి ద్వారా ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.
మకరం: ఈ రాశికి ద్వితీయ, తృతీయ స్థానాల్లో త్రిగ్రాహి యోగాలు ఏర్పడడం వల్ల అనేక మార్గాల ద్వారా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమవుతుంది.
కుంభం: ఈ రాశిలోనూ, ధన స్థానంలోనూ మూడు గ్రహాలు చొప్పున కలవడం వల్ల ఈ రాశివారికి ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.