
Money Astrology 2025
ఈ నెల 13 నుంచి 11 రోజుల పాటు, అంటే మార్చి 24వ తేదీ వరకు మీన రాశిలో శుక్రుడు అస్తంగత్వం చెందడం జరుగుతోంది. సూర్యుడికి బాగా దగ్గరైనప్పుడు దగ్ధం చెందడాన్నే అస్తంగత్వ దోషం అంటారు. ఏదైనా గ్రహం అస్తంగత్వం చెందినప్పుడు సహజంగానే ఆ గ్రహం బలహీనపడుతుంది. ఫలితంగా, ఈ గ్రహం ఇవ్వవలసిన యోగాలు నిష్ఫలమవుతాయి. సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు, ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, దాంపత్య జీవితానికి కారకుడైన శుక్రుడు తన ఉచ్ఛ స్థితిలో దగ్ధం కావడం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులకు కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సుందరకాండ పారాయణ వల్ల ఈ శుక్ర దోషం తగ్గిపోతుంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం ఈ రాశికి అనేక రకాల అదృష్టాలు కలిగిస్తుంది. శుక్రుడు అస్తంగత్వం చెందినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఇతరులు మీ మీద ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. ధన ధాన్య సమృద్ధికి లోటుండదు కానీ, కొద్దిపాటి అనారోగ్యాలు పీడించే సూచనలున్నాయి. వ్యాపారాలు కొద్దిగా మందకొడిగా పురోగమిస్తాయి. సహాయం పొందిన కొందరు బంధుమిత్రులు అవసర సమయాల్లో ముఖం చాటేయడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి దశమంలో ఉన్న శుక్రుడు దగ్ధం కావడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యానికి, ప్రాభవానికి కొద్దిపాటి భంగం కలుగుతుంది. అధికారులు, సహోద్యోగులతో అకారణ అపార్థాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు కొన్ని ముఖ్యమైన అవకాశాలు దగ్గర వరకూ వచ్చి ఆగిపోతాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగులకు సమస్యలు తలెత్తుతాయి. రాజపూజ్యాల స్థానంలో అవమానాలు ఎక్కువవుతాయి. కొందరు బంధుమిత్రులు దూరమయ్యే అవకాశముంది. ఆదాయానికి కొద్దిగా గండి పడుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడు అస్తంగతుడు కావడం వల్ల ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల వల్ల బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. బంధువుల జోక్యంతో ఈ సమస్యలు మరింత జటిలం అవుతాయి. ఆదాయం వృద్ధి చెందినప్పటికీ, కుటుంబ ఖర్చులు హద్దులు దాటుతాయి. తండ్రి ఆరోగ్యం బాగా ఆందోళన కలిగిస్తుంది. విదేశీ అవకాశాలు చేజారిపోతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. పిల్లల వల్ల సమస్యలుంటాయి.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు అస్తంగతుడైనందువల్ల దాంపత్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అపార్థాలు, విభేదాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో దెబ్బతినే సూచనలున్నాయి. పెళ్లి సంబంధాలు చివరి దాకా వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడతాయి. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కొందరు ముఖ్యమైన స్నేహితులు దూరమవుతారు. ఒకటి రెండు దుర్వార్తలు వినడం జరుగుతుంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు దగ్ధం కావడం వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆస్తి వివాదాలు, ఇతర కోర్టు కేసుల వల్ల చిక్కులు తలెత్తుతాయి. ఉచిత సహాయాలకు, వృథా ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందే అవకాశం ఉండకపోవచ్చు. కొందరు మిత్రులు శత్రువులుగా మారడం జరుగుతుంది. బంధువులు దుష్ప్రచారాలు సాగించే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం ఉత్తమం.
- మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు తృతీయ స్థానంలో అస్తంగతుడయినందు వల్ల ముఖ్యమైన ప్రయత్నాలకు ఆటంకాలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు ఒక పట్టాన ఆశించిన ఫలితాలనివ్వవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్ట పోయే అవకాశం ఉంటుంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో ఒక పట్టాన సంతృప్తి చెందకపోవచ్చు.