శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం 8, వ్యయం 14 | రాజపూజ్యాలు 4, అవమానాలు 5
ఈ రాశివారికి మార్చి 29తో ఏలిన్నాటి శని తొలగిపోతోంది. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెంది ముఖ్యమైన కష్టనష్టాల నుంచి బయటపడతారు. ఈ రాశివారి జీవితం అనేక విషయాల్లో తప్పకుండా కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది. మే 25న గురువు ఆరవ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది కానీ, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
ఆర్థిక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. శుభ కార్యాల మీద అంచనాలకు మించి ఖర్చవుతుంది. మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన విధంగా ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు.
ఈ రాశివారికి మే తర్వాత నుంచి కాలం బాగా కలిసి వస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు కలుగుతాయి. ప్రభుత్వపరంగా గుర్తింపు లభించడం, ధన లాభం కలగడం వంటివి జరుగుతాయి. నవంబర్, డిసెం బర్ నెలల్లో గురువు కర్కాటక రాశి ప్రవేశంతో వీరి ప్రాభవం, వైభవం మరింతగా పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. తల్లితండ్రుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఫిబ్రవరి నుంచి విశ్వావసు సంవత్సరం చివరి వరకూ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎక్కువ పర్యాయాలు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశివారు ఎక్కువగా శివార్చన చేయడం మంచిది.