
Aquarius 2026 Horoscope: కుంభ రాశివారికి ఏడాదంతా ఏలిన్నాటి శని దోషం కొనసాగడంతో పాటు, ఈ రాశిలో రాహువు సంచారం జరుగుతున్నందువల్ల కొద్దిపాటి కష్టనష్టాలు తప్పకపోవచ్చు. ఆదాయం తగ్గడం, ఖర్చు పెరగడం, చేతిలో డబ్బు నిలవకపోవడం, రావలసిన సొమ్ము రాకపోవడం, సహాయం పొందిన వారు ముఖం చాటేయడం వంటివి జరుగుతాయి. ఆటంకాలు, ఆలస్యాలు లేకుండా ఏ పనీ జరిగే అవకాశం ఉండదు. అయితే, కొత్త సంవత్సరం ద్వితీయార్థం కంటే ప్రథమార్థం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన ప్రయత్నాలను చేపట్టడం, ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం చాలా మంచిది.
ఏడాదంతా వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏ మాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడి, విశ్రాంతి తగ్గుతుంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మధ్య మధ్య ఇబ్బంది పెడుతుంది. ఖర్చులు పెరిగి రుణాలు చేయాల్సి వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ధన స్థానంలో ఉన్న శనీశ్వరుడి కారణంగా శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థాన భ్రంశం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల వంటివి వాయిదా పడతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది.
ఈ రాశివారు ఈ ఏడాదంతా ప్రేమ వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా అసంతృప్తి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పెళ్లి సంబంధాలకు బాగా ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. ఏడాది ప్రథమార్థంలో మాత్రమే పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి సంబంధించి ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రథమార్థంలో సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
ప్రథమార్థంలో పంచమ స్థానంలో ఉన్న గురువు కారణంగా ఆదాయ వృద్ధి ఉంటుంది కానీ, అందుకు తగ్గట్టుగా వృథా ఖర్చులు కూడా ఉంటాయి. ద్వితీయ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మధ్య మధ్య ధన యోగం పట్టి, ముఖ్యమైన అవసరాలు తీరడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి కూడా జరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
ఈ రాశివారికి ఫిబ్రవరి, మే నెలలు బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శుభ కార్యాలు జరగడంతో పాటు, శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనారోగ్యాలకు తగిన చికిత్స లభిస్తుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.