Friendship Astrology: స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ఈ అయిదు రాశుల వారికి కొత్త స్నేహాలు చిగురిస్తాయి..

| Edited By: Janardhan Veluru

Mar 07, 2023 | 2:05 PM

Telugu Astrology: మంచి స్నేహితులను కలిగి ఉండటం ఒక గొప్ప అదృష్టమనే చెప్పాలి. నమ్మకంగా, విశ్వాస పాత్రంగా, ఆధారపడగలిగినట్లుగా స్నేహాలు లభిస్తే జీవితం చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది.

Friendship Astrology: స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ఈ అయిదు రాశుల వారికి కొత్త స్నేహాలు చిగురిస్తాయి..
Friendship
Follow us on
మంచి స్నేహితులను కలిగి ఉండటం ఒక గొప్ప అదృష్టమనే చెప్పాలి. నమ్మకంగా, విశ్వాస పాత్రంగా, ఆధారపడగలిగినట్లుగా స్నేహాలు లభిస్తే జీవితం చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 11వ స్థానాన్ని స్నేహ స్థానంగా పరిగణిస్తారు. నిజానికి 11వ స్థానం పురోగతికి, పలుకుబడికి, వృద్ధికి కూడా సంబంధించిన స్థానం. వ్యక్తిగత జాతక చక్రం ప్రకారం, ఈ 11వ స్థానంలో శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఉన్న పక్షంలో మంచి మిత్రులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ స్థానంలో పాపగ్రహాలు అంటే శని, కుజ, రాహు, కేతువులు చెడు స్నేహితులు ఉంటారని స్థూలంగా చెప్పవచ్చు.
భూతత్వ రాసులైన వృషభం, కన్య, మకర రాశి వారు స్నేహానికి అత్యంత విలువ ఇస్తారని, ఈ రాశుల వారితో స్నేహం చేసిన వారు వీరిని జీవితాంతం వదిలిపెట్టి ఉండాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశుల తరువాత ధనస్సు, మీనరాశుల వారు కూడా స్నేహానికి అత్యంత విలువనిస్తారని శాస్త్రం చెబుతోంది. ఈ ఏడాది ఈ ఐదు రాశుల వారి జీవితాలలో కొత్త స్నేహితులు ప్రవేశించే అవకాశం ఉంది. వీరికి గురు శుక్ర బుధ గ్రహాలు ఈ ఏడాది బాగా అనుకూలంగా ఉండటమే దీనికి కారణం.

వృషభ రాశి

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ రాశి వారికి చక్కని స్నేహ యోగం ప్రారంభం అయింది. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. వీరికి కొందరు సంపన్నులతో, సమాజంలో మంచి గుర్తింపు ఉన్నవారితో పరిచయాలు ఏర్పడి కలకాలం వృద్ధి చెందుతాయి. ఈ స్నేహితులు జీవితాంతం అండగా, వెన్నుదన్నుగా నిలబడే అవకాశం ఉంది. సాధారణంగా వృషభ లగ్నం లేదా వృషభ రాశి జాతకులు స్నేహం కోసం ఎన్ని త్యాగాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. తర తమ భేదాలు లేకుండా నిస్వార్ధంగా స్నేహం చేయడంలో వీరి తరువాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. వీరి తత్వానికి తగ్గట్టుగానే కొత్త పరిచయాలు ఏర్పడటం జరుగుతుంది.

కన్యా రాశి

ఈ రాశి వారికి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉన్నత స్థానాలలో ఉన్న వారితో, మేధావులతో, వాణిజ్యవేత్తలతో పరిచయాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. సాధారణంగా ఇవ్వటమే తప్ప తీసుకోవటం అంటూ ఉండని ఈ రాశి వారు ఈ కొత్త స్నేహితులను జీవితాంతం వదిలిపెట్టే అవ కాశం లేదు. ఈ కొత్త స్నేహాల కారణంగా జీవితం అనేక సానుకూల మలుపులు తిరగటానికి, కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవ కాశం ఉంది. కొత్త స్నేహాల వల్ల ఈ రాశి వారికి సమాజంలో పట్టు పలుకుబడి పెరిగే సూచనలు ఉన్నాయి. సాధారణంగా కన్యా రాశి వారు స్నేహం విషయంలో చిన్నా పెద్దా, ఆడా, మగా భేదం పాటించరు. కుల మత ప్రస్తావన కూడా ఉండదు. స్నేహం కోసం ఎటువంటి త్యాగానికైనా వెనుకాడరు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి సాధారణంగా స్నేహితులు ఎక్కువ. స్నేహితులకు విందులు ఇవ్వడంలో, వినోదాలు కల్పించడంలో వీరికి వీరే సాటి. ఎప్పటికప్పుడు కొత్త స్నేహాలను సంపాదించు కుంటూ ఉండటం వీరి నైజం. ఈ తత్వం ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కుతుంది. అపర కుబేరులతో, రాజకీయ, సేవా రంగాలలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడి క్రమక్రమంగా వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలతో వీరికి అత్యంత సాన్నిహిత్యం ఏర్పడే అవకాశం ఉంది. కొత్త స్నేహాల కారణంగా వీరిలోని ప్రతిభ బాగా వెలుగులోకి వస్తుంది. వీరి వల్ల వీరి కొత్త స్నేహితులు కూడా అనేక విధాలుగా లబ్ధి పొందడం జరుగుతుంది. జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి.

మకర రాశి

ఈ రాశి వారు ఒక పట్టాన ఎవరితోనూ స్నేహం చేయరు. అయితే, స్నేహం అంటూ ఏర్పడితే ఒక పట్టాన వదిలిపెట్టరు. స్నేహితులకు సహాయం చేయాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల నుంచి ఎటువంటి సహాయాన్ని వీరు ఆశించరు. ఎక్కువగా సేవా దృక్పథం ఉన్నవారితో వీరు స్నేహం చేస్తూ ఉంటారు. స్నేహితుల నుంచి నిజాయితీని మాత్రమే వీరు కోరుకుంటారు. వీరికి సాధారణంగా చిన్ననాటి స్నేహితులు అంటే చాలా ఇష్టం. ఈ ఏడాది ఈ రాశి వారికి రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన వారితో కొత్తగా పరిచయాలు ఏర్పడబో తున్నాయి. ఈ పరిచయాల వల్ల వీరికి ఉపయోగం ఉన్నా లేకపోయినా, స్నేహితులకు మాత్రం వీరి వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. పలుకుబడి కలిగిన మహిళా స్నేహితులతో కూడా వీరికి మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.
మీన రాశి
ఈ రాశి వారి స్నేహం స్వచ్ఛంగా ఉంటుంది. ఈ రాశి వారి స్నేహంలో కల్మషం ఉండదు. సాధార ణంగా ఈ రాశి వారు ఆధ్యాత్మిక, అధ్యాపక స్థానాలలో ఉన్న వారితో స్నేహం చేస్తూ ఉంటారు. స్నేహం చేయడంలో ఏ రకమైన తారతమ్యాన్ని వీరు పాటించరు. సేవా దృక్పథం కలిగిన వారితో సాన్నిహిత్యం పెంచుకుంటారు. స్నేహం కోసం ఎంత శ్రమ పడటానికైనా సిద్ధపడతారు. ఈ రాశి వారిలో త్యాగగుణం, ఔదార్యం కాస్తంత ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాల కారణంగానే వీరి పరిచయాలు పెరుగుతుంటాయి. స్నేహితుడు అయితే చాలు, అతని కోసం ఏ పని చేయడానికి అయినా వెనుకాడరు. ఈ కారణంగా అప్పుడప్పుడు నష్టపోతున్నప్పటికీ పట్టించుకోరు. మంచి స్నేహితుల మీద ముందూ వెనకా చూడకుండా ఖర్చు చేయడం ఈ ఏడాది మరీ ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి.
(కౌశిక్, ప్రముఖ జ్యోతిష్య పండితులు)
Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..