CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) శుక్రవారం విశాఖలో పర్యటించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో వాహన మిత్ర చెక్కులను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగో విడత వైఎస్సార్ మిత్ర చెక్కులను పంపిణీ చేశారు. ఈ వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా 2,61,516 మందికి రూ.10 వేల చొప్పున సాయం అందించారు. ఈ సాయం అందించడం వరుసగా 4వ ఏడాది 261.51 కోట్ల సాయం అందింది. ఇక ఇప్పటికి వరకు మొత్తం రూ.1,026 కోట్లు వరకు ఈ స్కీమ్ కింద అందించారు. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు మాత్రమే ఈ ఆర్థిక సాయం అందుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఇప్పటి వరకు అందిన సాయం రూ.40 వేలు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చాక నాలుగు నెలల్లోనే వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించామని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఈ పథకాన్ని కొనసాగించామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదలకు అండగా ఉంటుందని అన్నారు. మూడు సంవత్సరాలలో రూ.1.65 లక్షల కోట్లు నేరుగా లబ్బిదారుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. ఎక్కడ లంచాలకు తావు లేకుండా నేరుగా అకౌంట్లోనే జమ చేశామన్నారు. తమ ప్రభుత్వం పార్టీ, కులం అని చూడకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నామని, రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ ఉన్న అర్హులైన డ్రైవర్లకు ఆర్థిక సాయం అందింది. గత మూడేళ్ల కంటే ఈ ఏడాదిలో ఎక్కువ మంది ఈ వాహన మిత్ర సాయం అందుకున్నారు.
వాహన మిత్రకు మొత్తం 2,61,516 లబ్దిదారుల ఎంపిక:
ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర సమయంలో నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఈ సాయం అందిస్తున్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. మొత్తం 2,61,516 మంది లబ్దిదారుల్లో బీసీలు 1,44,164 ఉండగా, ఎస్సీలు 63,594 మంది, ఎస్టీలు 10,472 మంది ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి