
రైల్వే హైటెన్షన్ వైర్లు కాలుష్య రహిత జర్నీకి ఎంతగా ఉపయోగకరంగా ఉంటాయో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వాటితో అంతే ప్రమాదం. ఈ విషయం తెలియక కొందరు ఆకతాయిలు రైలు టాప్ పైకి ఎక్కి విద్యుత్ షాక్ తగిలి కాలిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు ఇలాగే ట్రైన్ టాప్ పైకి ఎక్కి చనిపోయినంత పని చేశాడు. శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్. సమయం సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం 3గంటల 25 నిమిషాలు. సరిగ్గా అదే సమయంలో భువనేశ్వర్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చి సోంపేట రైల్వే స్టేషన్‌లో ఆగింది. ట్రైన్ ఆ స్టేషన్‌లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఆగుతుంది. దీంతో ప్రయాణికులు ట్రైన్‌లోకి ఎక్కేవాళ్ళు చకచక ఎక్కుతున్నారు. ట్రైన్ నుండి దిగేవారు దిగుతున్నారు.
ఇంతలో బెంగాల్ కి చెందిన ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. భువనేశ్వర్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సోంపేట రైల్వే స్టేషన్‌లో ఆగిన వెంటనే ట్రైన్ టాప్ పైకి ఎక్కి యువకుడు కలకలం రేపాడు. కాస్త హైట్‌లోనే రైల్వే విద్యుత్ వైర్లు ఉండటంతో ఏం ప్రమాదం సంభవిస్తాదో అంటూ కాసేపు అందరిలో ఆందోళన నెలకొంది. రైలుపై నుంచి కిందకు దిగాలని తోటి ప్రయాణికులు ఎంత వారించినా యువకుడు వినలేదు. పైగా తనను కిందకు దింపేందుకు రైలు పైకి ఎవరు ఎక్కిన కొడతానంటు చేతిలో రాయిపట్టుకొని అందరిని బెదిరించసాగాడు. అయితే చివరకు ఓ ప్రయాణికుడు ప్రాణాలకు తెగించి చాటుగా రైలు పైకి ఎక్కి యువకుడిని పట్టుకొన్నాడు. పెనుగులాడే ప్రయత్నం చేయగా రెండు తగిలించి యువకుడిని కిందకు నెట్టేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో కింద ఉన్న ప్రయాణికులు ఆ యువకుడిని కళ్ళు పట్టుకొని కిందకు లాగేసారు. అనంతరం యువకుడికి దేహశుద్ధి చేశారు. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పటంతో హమ్మయ అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. యువకుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే యువకుడికి మతి స్థిమితం లేదని రైల్వే సిబ్బంది గుర్తించారు. యువకుడు హల్‌చల్‌తో సోంపేట రైల్వే స్టేషన్ నుంచి రైలు 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.