కలకాలం తోడూనీడగా ఉంటాడని ప్రేమ వివాహం చేసుకుంది.. కానీ అతను చేసిన మోసం తట్టుకోలేక..!

కుటుంబాన్ని ఎదిరించి, నాయకుడిని నమ్మి పెళ్లి చేసుకున్న ఓ వివాహిత చివరికి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయి, భర్త వేధింపులు తట్టుకోలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో చోటుచేసుకుంది.

కలకాలం తోడూనీడగా ఉంటాడని ప్రేమ వివాహం చేసుకుంది.. కానీ అతను చేసిన మోసం తట్టుకోలేక..!
Young Woman Suicide

Edited By:

Updated on: May 23, 2026 | 1:19 PM

కుటుంబాన్ని ఎదిరించి, నాయకుడిని నమ్మి పెళ్లి చేసుకున్న ఓ వివాహిత చివరికి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయి, భర్త వేధింపులు తట్టుకోలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో చోటుచేసుకుంది.

అహోబిలం గ్రామానికి చెందిన బేరింగుల హరిస్వామి, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె మోహిత. ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన స్థానిక రాజకీయ నాయకుడు పుల్లయ్య ప్రేమ పేరుతో మోహిత వెంటపడ్డాడు. “నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వే నా సర్వస్వం” అంటూ మాయమాటలతో ఆమెను నమ్మించాడు. ఈ విషయం మోహిత ఇంట్లో చెప్పగా, అతని ప్రవర్తన మంచిది కాదని, పైగా కులాలు వేరు అని తల్లిదండ్రులు తీవ్రంగా వారించారు. కానీ, ప్రేమ గుడ్డిదన్నట్లుగా మోహిత పెద్దలను ఎదిరించి, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పుల్లయ్యను వివాహం చేసుకుంది.

పెళ్లయిన ఐదేళ్లపాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే, గత ఏడాది కాలంగా పుల్లయ్య తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తన అనుచరుడిగా ఉన్న ఒక గిరిజన యువకుడి భార్యపై కన్నేసిన పుల్లయ్య, ఆమెను భర్తకు దూరం చేసి హరినగరం గ్రామంలో ఉంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త చేస్తున్న అన్యాయాన్ని భరిస్తూ, పిల్లల కోసం మోహిత మనసు చంపుకుని కాపురం చేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో పుల్లయ్యతో పాటు అతని కుటుంబ సభ్యుల వేధింపులు కూడా మితిమీరిపోయాయి. పుల్లయ్య మోసం చేశాడు, ఇక బతకలేను అంటూ మోహిత ఇటీవల పుట్టింటికి వెళ్లి తన తల్లి వద్ద కన్నీరు పెట్టుకుంది. అయితే భర్త రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కావడంతో, సర్దుకుపోవాలంటూ తల్లిదండ్రులు ఆమెను నచ్చజెప్పి పంపించారు.

వేధింపులు భరించలేకపోయిన మోహిత, గురువారం (మే 21) రాత్రి అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నంద్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. అయితే, మోహితది ఆత్మహత్య కాదని, ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని తండ్రి హరిస్వామి ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, క్షణికావేశంలో పెద్దలను ఎదిరించి, అనాలోచిత నిర్ణయాలతో ఇటువంటి రాజకీయ నాయకుల మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దనేదానికి మోహిత ఉదంతమే ఒక కఠిన ఉదాహరణ.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us