
కృష్ణా నది తీరంలోని లంక భూముల్లో అడవి ఆవుల బెడద రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే వాతావరణ ప్రతికూల పరిస్థితులు, ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోతున్న అన్నదాతలకు, ఈ అడవి ఆవులు అదనపు సమస్యగా మారాయి. ఈ లంక భూముల్లో వేల సంఖ్యలో సంచరిస్తున్న అడవి ఆవులు ఆహారం కొరతతో పంట పొలాలపై దండెత్తుతూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ అడవి ఆవుల సంతతి ఎలా పెరిగిందంటే, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య పులిచింతల దిగువ నుంచి ప్రకాశం బ్యారేజీ ఎగువ వరకు ఒకప్పుడు వందలు, వేల ఎకరాల్లో విశాలమైన లంక భూములు ఉండేవి. అక్కడ కావాల్సినంత మేత, నీళ్లు లభించేవి. సమీప గ్రామాలకు చెందిన రైతులు తమ పశువులను అక్కడే వదిలేసి, తిరిగి గ్రామంలో మేత దొరికినప్పుడు ఇంటికి తీసుకువచ్చేవారు. కృష్ణా ఒడ్డున ఉండే గ్రామాల రైతులు తమ పశువులను లంక భూముల్లోనే పోషించేవారు. అలా వదిలేసిన కొన్ని పశువులు తప్పిపోయి, అక్కడే తమ సంతతిని వృద్ధి చేసుకున్నాయి. అంతేకాకుండా, వరదల సమయంలో ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన పశువులు కూడా ఈ ప్రాంతంలోనే స్థిరపడి, వాటి సంఖ్యను పెంచుకున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య వేలల్లో ఉండగా, ఒక్కో మందలో 70 నుండి 100 పైగా ఆవులు ఉన్నాయి. ఈ అడవి ఆవుల మందల్లో అరుదైన ఒంగోలు జాతి ఆంబోతులు, ఆవులు, దూడలు కూడా ఉన్నాయి. లంక భుముల్లో ఎలాంటి ఆజమాయిషీ లేకుండా తిరగడం, దూకుడు స్వభావం పెరగడంతో ఈ ఆవులను రైతులు అడవి ఆవులుగా సంభోదించేవారు. దీంతో వాటికి ఆ పేరు స్థిరపడిపోయింది.
ఒకప్పుడు ఏడాది పొడవునా పచ్చటి గడ్డితో కళకళలాడిన ఈ లంక భూములు ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నాయి. ప్రభుత్వం ఈ భూములను పేదలకు పంపిణీ చేయడంతో, అక్కడ యూకలిప్టస్, సుబాబుల్ తోటల పెంపకం మొదలైంది. దీంతో ఆవులకు మేత దొరక్క, నివాస స్థలం కొరవడి, గత నాలుగేళ్లుగా ఆకలితో అల్లాడుతూ పంట పొలాలపై పడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడు, పల్నాడు జిల్లాలోని క్రోసూరు, అచ్చంపేట మండల పరిధిలోని తీర గ్రామాల రైతులు పత్తి, మిరప, మొక్కజొన్న, పసుపు, సుబాబుల్ వంటి పంటలను సాగు చేయడంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. రాత్రికి రాత్రే వచ్చి పదుల ఎకరాల పంటను ధ్వంసం చేస్తున్నాయి. ఒక మంద ఒక రోజులో పది ఎకరాల పంటను నాశనం చేస్తోందని రైతులు వాపోతున్నారు. పొలాలకు వేసిన ఫెన్సింగ్‌ను కూడా తొక్కి, స్తంభాలను, వైర్‌ను పడగొట్టి లోపలికి చొరబడుతున్నాయి. రైతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై దాడులకు కూడా తెగబడుతున్న సందర్భాలు ఉన్నాయి.
ఈ సమస్య తీవ్రతను గ్రహించిన చందర్లపాడు రైతులు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావించారు. దీంతో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీశా స్వయంగా వెళ్లి ఆవుల మందలను డ్రోన్ ద్వారా వీడియోలు తీయించారు. ఈ సమస్య గత 15-20 సంవత్సరాలుగా ఉందని, ఇప్పుడైనా పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. వారి వినతితో అడవి ఆవుల నుంచి పంటలను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అటవీశాఖ సహకారంతో ఈ ఆవులను బయటకు తెచ్చి ప్రత్యేక గోశాలలకు తరలిద్దామనుకున్నారు. ఈ ఆవులను పట్టుకోవడానికి గంగిరెద్దులను ఆడించే కుటుంబాల వారితో కూడా మాట్లాడారు. వైల్డ్ లైఫ్ జంతువులను మత్తు మందు ఇచ్చి పట్టుకున్నట్లే, వీటికి కూడా మత్తు మందు ఇచ్చి పట్టుకోవడం ఒక మార్గంగా అనుకున్నారు. పట్టుకున్న తర్వాత వీటికి శిక్షణ ఇప్పించి పెంపుడు ఆవుల్లా మచ్చిక చేసుకుని, ఆ తర్వాత రైతులకు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని భావించారు. కానీ ఈ ఆలోచనలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు.