Andhra: పని చేసుకుంటున్న రైతులు.. పొలంలో గడ్డి మాటున ఇది..

తూర్పు గోదావరి జిల్లాలో పొలాల్లో చిన్న అడవి పిల్లి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరి కోతల తర్వాత ఖాళీగా ఉన్న పొలాల్లో ఈ వన్యప్రాణి సంచారం రైతుల్లో ఆందోళనకు దారితీసింది. సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్ రెస్క్యూ టీమ్ అడవి పిల్లిని సురక్షితంగా పట్టుకుని తరలించింది.

Andhra: పని చేసుకుంటున్న రైతులు.. పొలంలో గడ్డి మాటున ఇది..
Wild Cat

Edited By:

Updated on: May 15, 2026 | 1:38 PM

సాధారణంగా వ్యవసాయ పనులు చేసుకునే వారికి అడవి జంతువులు, పాముల నుంచి అపాయం ఉంటుంది. పాములు, తేళ్ల నుంచి ఇతర హానికర కీటకాలనుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. అయితే పొలంలో పనిచేసేందుకు వెళ్ళినవాళ్లకు ఒక వింత జంతువు తారసపడటం తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది.

పొలాల్లో అడవి పిల్లి కలకలం.. రైతుల్లో ఆందోళన

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల అడవి పిల్లి సంచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా వరి కోతలు పూర్తయిన అనంతరం ఖాళీగా ఉన్న పొలాల్లో ఈ అడవి జంతువు కనిపించడం స్థానిక రైతుల్లో ఆందోళనకు దారితీసింది. తాజాగా ఓ రైతు పొలంలో గడ్డిలో దాక్కున్న చిన్న అడవి పిల్లిని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్ రెస్క్యూ టీమ్ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని జంతువును రక్షించారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పొలాల వద్ద వింత శబ్దాలు వినిపించడంతో పాటు కోళ్లు, చిన్న పక్షులు కనిపించకుండా పోతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గడ్డిలో దాక్కున్న చిన్న అడవి పిల్లిని రైతులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. అడవుల్లో సంచరించే పిల్లి పొలాల్లో కనిపించటం అరుదు. ఇది పిల్ల కావడంతో దానికి సంబంధించిన పెద్ద పిల్లులు సైతం ఇంకా ఈ ప్రాంతంలో సంచరించే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
అటవీ సిబ్బంది ముందుగా ప్రజలు ఎవరూ దగ్గరకు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. ఆ పిల్లిని సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం తంతు ను గ్రామస్తులు ఆసక్తిగా వీక్షించారు.

వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం, అడవులు తగ్గిపోవడంతో ఆహారం కోసం ఇలాంటి అడవి జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని చెబుతున్నారు. వాతావరణ మార్పులు వంటి కారణాలతో అడవి జంతువులు గ్రామాల వైపు వస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా వరి పొలాలు, గడ్డి మైదానాలు చిన్న జంతువులకు ఆశ్రయంగా మారుతున్నాయని పేర్కొన్నారు. రైతులు భయపడకుండా, ఇలాంటి జంతువులు కనిపించినప్పుడు వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ అడవి పిల్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతుండటంతో అటవీ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అడవులను సంరక్షించడం ద్వారా మాత్రమే వన్యప్రాణులు తమ సహజ నివాసాల్లోనే ఉండగలవని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

Follow Us