అనకాపల్లి జిల్లాలో ఓ వ్యక్తి మిస్సయ్యాడు. అంతా వెతికారు. కనిపించిన వారందరినీ ఆచూకీ కోసం అడిగారు. అయినా ఎక్కడా అతని జాడలేదు..! చివరకు పోలీస్ స్టేషన్లో భార్య కంప్లైంట్ ఇచ్చింది. కేసు ఫైల్ అయింది. కానీ ఆ వ్యక్తి ఎక్కడ అనేది తెలియలేదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఉంటేనే కదా..? చివరకు..
ప్రియుడిపై మోజుతో భర్త హత్యకు ప్లాన్ చేసింది భార్య. హత్య చేసి ఆపై ఏమి ఎరగనట్టు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టింది. మాయమాటలతో భర్తను కారులో తీసుకెళ్లి.. గొంతు నులిమి ప్రియుడితో కలిసి చంపేశారు. ఆపై మృతదేహాన్ని మూటగట్టి గోదావరిలో పడేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అసలు విషయం బయటపడింది.
అనకాపల్లి జిల్లా యలమంచిలిలో అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. హత్యగా తేలింది. యలమంచిలి మండలంలోని పులపర్తి గ్రామంలో కొండలరావు భార్య ఉమాతో కలిసి ఉంటున్నాడు. ఉమాకు తూర్పు గోదావరి జిల్లా సూరవరంకు చెందిన చిరంజీవితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. అనుమానం వచ్చిన భర్త భార్యను ప్రశ్నించాడు. నచ్చ చెప్పాడు. దీంతో ఉమా ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నట్టు నటించింది. భర్తతో నమ్మకం కుదిరించింది. అయినప్పటికీ.. తన వివాహేతర బంధానికి ఉన్న భర్త అడ్డును తొలగించుకోవాలని అనుకుంది. భర్తను అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి భార్య ఉమా ప్లాన్ చెసింది. ఈ నెల 7వ తేదీన కొండలరావుకి మాయమాటలు చెప్పిన భార్య.. కారులో షికారుకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లింది. ఆమె మాయమాటలు వెనుక ఉన్న మర్మాన్ని గుర్తించలేని భర్త ఆమెతో కలిసి వెళ్ళాడు. ఆ తర్వాత 8వ తేదీ తెల్లవారుజామున కారులో గొంతు నులిమి హత్య చేశారు.
కొండలరావు మృతదేహాన్ని మూటగట్టి.. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద గోదావరి నదిలో పడేశారు. ఆపై ఏమి ఎరగనట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది భార్య ఉమా. తన భర్త కనిపించడం లేదని వెతికి పెట్టాలని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అనుమానాలపై ఆరా తీశారు. భార్యను పట్టుకుని విచారించేసరికి తొలుత తప్పించుకోవాలని ప్రయత్నించింది. చివరకు అసలు విషయం ఒప్పుకుంది. దీంతో ప్రియుడు చిరంజీవి, అతనికి సహకరించిన మరో వ్యక్తి సూర్యను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొండలరావు మృతదేహం కోసం ఆరా తీశారు. గోదావరిలో పడేసినట్టు నిందితులు చెప్పడంతో.. నదిలో గాలించి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. భార్య ఉమా, ప్రియుడు చిరాంజీవి సహా మిగతా ముగ్గురిని అరెస్ట్ చేశామని అన్నారు సీఐ గఫూర్. ఇది ప్రియుడిపై మోజుతో భర్తను హత్య చేసేందుకు భార్య వేసిన ప్లాన్‌గా పోలీసులు తేల్చారు. ఆమె వేసిన ప్లాన్‌కు కంగుతిన్నారు. భార్య చేసిన తప్పుతో.. అమాయక భర్త కాటికి వెళ్ళాడు. నిందితులు కటకటాల వెనక్కి వెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు.