
కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటీవల భర్త హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ఓ భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తిలక్ నగర్‌కు చెందిన భీమ్ శెట్టి ప్రకాశ్ బుక్ స్టాల్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. భార్య ప్రసన్న(39), పిల్లలు అశ్రిత్(15), మేఘన(13)తో కుటుంబం కలకలలాడేది. విధి ఆడిన నాటకంలో నవంబర్ నెలలో భీమ్ శెట్టి ప్రకాశ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. అన్యోన్యంగా సాగుతున్న జీవితాల్లో చీకట్లు నిండాయి. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక, ఆయన జ్ణపకాలతో భార్య ప్రసన్న డిప్రెషన్‌లోకి వెళ్లింది. భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేక మరణానికి సిద్ధమైంది. అయితే పిల్లలను సైతం తనతో పాటే తీసుకెళ్లాలని భావించింది. రెండు రోజుల క్రితం పిల్లలను తీసుకుని కల్వకుర్తి పట్టణంలోని పుట్టింటికి వెళ్లింది ప్రసన్న. తాను, తన పిల్లలు ఇంకొకరికి భారం కాకూడదని అక్కడే ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లలకు నిద్రమాత్రలు వేసి.. తాను అవే మింగేసింది. కాసేపటికి అక్కతో మాట్లాడుదామని వెళ్లిన సోదరుడు విగత జీవులుగా పడి ఉన్న ప్రసన్న, ఇద్దరు పిల్లలను గమనించాడు. వెంటనే అస్పత్రికి తరలించగా తల్లి ప్రసన్న, కూతురు మేఘన చనిపోయారని వైద్యులు తెలిపారు. కుమారుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ అస్పత్రికి తరలించారు.
నేను, నా పిల్లలు ఒకరికి భారం కాకూడదు. నా పిల్లలను తండ్రి లేకుండా చూడలేకపోతున్నానంటూ లేఖను ప్రారంభించి.. తనకు, తన భర్త, పిల్లల మధ్య ఉన్న ప్రేమానురాగాలను పేర్కొంది. మా డెడ్ బాడీలకు పోస్టుమార్టం చేయవద్దని వేడుకుంది. తన పిల్లలను అల్లారుముద్దుగా చూసుకున్నామని.. ఏనాడు ఒక్కదెబ్బ కూడా కొట్టలేదని.. వారి శరీరంపై ఒక్క గాటు కూడా పడవద్దని లేఖలో బ్రతిమాలింది ప్రసన్న. తనకు పెళ్లి చీర, కూతురికి గ్రీన్ చీరతో అంత్యక్రియలు జరపాలని తెలిపింది. తన భర్త, తనను, పిల్లలను ఎంతో మంచిగా చూసుకునేవాడని.. 16ఏళ్లు కలిసిమెలిసి ఉన్నానని ఈ జీవితానికి ఇది చాలని చెప్పింది. భర్త లేని బ్రతుకు నాకు పోరాటం, యుద్ధమే.. చివరగా చేతకాని తల్లి క్షమించండి అని పిల్లల ముద్దుపేర్లు మిట్టు, మిన్ని పేర్లు రాసి.. తనువు చాలించింది. ఇలా పిల్లాపాపలతో కలకలలాడే పచ్చని కుటుంబం ఒక్కసారిగా చెల్లాచెదురయ్యింది. విషాద ఘటన ప్రసన్న కుటుంబ సభ్యులు, బంధువులనే కాదు కల్వకుర్తి పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.