AP – Telangana: వందే భారత్ రైళ్లపై అసలు రాళ్లు ఎందుకు విసురుతున్నారు..? తిక్కా.. వెర్రా

|

Feb 05, 2023 | 6:23 PM

అవి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులుదీస్తాయి. అందులో ప్రయాణం హాయిగా ఉంటుంది అంటారు. కాని ఆ వేగం కొందరికి తిక్క పుట్టిస్తోంది. ఏం చేయాలో అర్థం కాక ఆకర్షణీయంగా కనిపిస్తున్న దానిపై రాళ్లు విసురుతున్నారు. అలా రాళ్లు విసిరిన కొందరు పోలీసులకు చిక్కుతున్నారు.

AP - Telangana: వందే భారత్ రైళ్లపై అసలు రాళ్లు ఎందుకు విసురుతున్నారు..? తిక్కా.. వెర్రా
Vande Bharat Train
Follow us on

ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న వందే భారత్‌ రైళ్లకు నిత్యం చిక్కులు తప్పడం లేదు. అతి వేగంతో అద్భుతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ రైళ్లకు వాటి అందాలే శత్రువులుగా మారుతున్నాయి. ఆకర్షణీయంగా కనిపించే ఈ రైలు అద్దాలను అకతాయి నిత్యం ఏదో ఒక చోట రాళ్లతో ధ్వంసం చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై ఖమ్మంలో కొందరు అకతాయిలు రాళ్లు విసిరారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో రైలు C-కోచ్‌ ఎమర్జెన్సీ విండో గ్లాస్‌ పగిలిపోయింది. ఈ కారణంగా రైలు ప్రయాణం గంట ఆలసమ్యైంది. పగిలిన కిటికీ గ్లాసును విశాఖపట్నంలో తొలగించి కొత్తది అమర్చారు. ఈ కారణంగా విశాఖ నుంచి బయలుదేరాల్సిన రైలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.

ఈ ఘటనపై RPF కేసు నమోదు చేసింది. రైలుపై రాళ్లు విసిరిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ఇద్దరు పిల్లలకు పోలీసులు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చి వారి నుంచి రాతపూర్వక బాండ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏలూరు సమీపంలోనూ నాలుగు రోజుల క్రితం ఇలాంటి సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభానికి ముందు కూడా కొందరు అకతాయిలు రాళ్లు విసిరారు. గత నెల 11న విశాఖపట్నం కంచరపాలెం కోచ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో కొందరు యువకులు రాళ్లు విసరడంతో రైలు అద్దాలు పగిలాయి. దీనిపై సీసీ ఫుటేజ్‌ పరిశీలించిన RPF పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశాయి. వాళ్లంతా తాగి ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఒక కిటీకి గ్లాస్‌ మొత్తం పగిలిపోగా, మరొకదాని గ్లాస్‌కు పగుళ్లు వచ్చాయి. ఈ తరహా ఘటనలు అటు బిహార్‌లోనూ నమోదయ్యాయి. హౌరా-న్యూజల్పాయిగురి మధ్య నడుస్తున్న వందేభారత్‌ ట్రైన్‌పై వరుసగా రెండుసార్లు కొందరు అకతాయిలు రాళ్లు విసిరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..