Political Reactions on AP three Capitals: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమని అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. దానిపై వెనక్కి తగ్గేదేలేదని తేల్చి చెప్పారు. అయితే, అందరి అనుమానాలను, అపోహలు తీర్చేలా, న్యాయ, చట్టపరమైన ఇబ్బందులను అధిగమించేలా మెరుగైన బిల్లును తీసుకొస్తామని ప్రకటించారు. అప్పటి వరకు ఇప్పుడున్న బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. గత బిల్లులోని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. వికేంద్రీకరణ అవసరాన్ని, బిల్లులోని సదుద్దేశాన్ని అందరికీ వివరిస్తామన్నారు. చట్ట, న్యాయపరంగా అన్నింటికీ సమాధానం ఇచ్చేలా బిల్లులో మార్పులు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాలకు, అందరికీ దాన్ని వివరిస్తామన్నారు. ఇంకా ఏమైనా మార్పులు చేయడానికి సిద్ధమేనన్నారు సీఎం జగన్. అందుకే గత బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు.
అంతకుముందు ఏపీ అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు చర్చకు వచ్చింది. ఈ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట‍్టగా.. బిల్లుపై చర్చకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించారు. బిల్లుపై అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ… రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు వికేంద్రీకరణకే ప్రాధాన్యత ఇచ్చాయని బుగ్గన పేర్కొన్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే.. వేర్పాటు వాదం వస్తుందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. అయితే, బాహుబలి తరహాలో రాజధాని కట్టాలని గత ప్రభుత్వం అబాసుపాలైందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. రాజధాని 7500 చదరపు కిలోమీటర్లు పరిధిలో కట్టాలనుకున్నారని…ఆర్థిక రాజధాని ముంబై సిటీయే 4300 చదరపు కిలోమీటర్లు ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తు ఆర్థిక అంచనాలు లేకుండానే రాజధాని కట్టాలనుకున్నారని మంత్రి బుగ్గన ఎద్దేవా చేశారు.
ఇదిలావుంటే, మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కర్నూలు బార్ అసోషియేషన్ సభ్యులు. న్యాయ రాజధాని విషయంలో కర్నూలుకు అన్యాయం జరిగితే జరగబోయే పరిణామాలు ఊహించలేమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించగానే టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నాం.. ఇప్పుడు ఆ నిర్ణయం అమలు కాకపోతే ఉద్యమిస్తామంటున్నారు అడ్వకేట్లు. తిరిగి న్యాయ రాజధాని దక్కకపోతే అంతే స్థాయిలో లో రిటాలియేషన్ ఉంటుందని కర్నూలు అడ్వకేట్ వారి అసోసియేషన్ హెచ్చరించింది.
మరో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము మూడు రాజధానులపై వెనక్కి తగ్గలేదని, ఆగిపోలేదని స్పష్టం చేశారు. ఇంకా పకడ్బందీగా తమ నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు. రాష్ట్ర ప్రజల అందరి అభిప్రాయాలు తీసుకుని మళ్లీ ముందుకు వస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ప్రజల మనోభావాలు ఏంటి అనేది కూడా సీఎం చెప్పారని పేర్కొన్నారు. ఎక్కడో ఒక దగ్గర అపోహలు ఉన్నాయని, టీడీపీ దుష్ప్రచారాలు చేసిందని బొత్స విమర్శించారు. రైతులకు ఇంకా సమస్య ఎక్కడ ఉందని, వాళ్ల మనసుకు తగ్గట్టు తాము అన్ని చేయలేమన్నారు.
ప్రజాభిప్రాయం తీసుకుని బిల్లులో జతపరిచి సభలో ప్రవేశపెడతామన్నారు మంత్రి పేర్ని నాని. కోర్టు తీర్పులతో తమకు వచ్చిన ఇబ్బందేం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోన అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.
ఏపీ సర్కార్ నిర్ణయంపై తెలుగు దేశం పార్టీ స్పందించింది. ప్రభుత్వ౦ ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకుందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ముఖ్యమంత్రి కూడా రాజధాని ఒక చోటే ఉండాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారన్నారు. ఎవరు వచ్చినా సరే రాజధాని అక్కడే ఉంటుందన్నారు. రాజధానిపై అసెంబ్లీలో చర్చించి.. దాన్ని చట్టం చేస్తే అప్పుడు నమ్ముతామన్నారు. ఈ ప్రకటన నమ్మడానికి లేదని, పూర్తి ప్రకటన చూసిన తర్వాత స్పందిస్తామని అయ్యన్న పాత్రుడు అన్నారు.
రాజధానుల విషయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. మొదటి నుంచి అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇది అమరావతి రైతులు , రాష్ట్ర ప్రజల విజయమన్నారు. అలాగే, కర్నూలులో హైకోర్టు కట్టాలని మా డిక్లరేషన్‌లో ఉందని గుర్తు చేసిన వీర్రాజు.. రాయలసీమ డిక్లరేషన్ పై కట్టుబడి ఉన్నామన్నారు. రాయలసీమలో వైసీపీ నాయకులకు నోరుమెదిపే ధైర్యంలేదన్నారు. వెనుకబడిన రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని సోము వీర్రాజు భరోసా ఇచ్చారు.