Weekend Hour: ప్రజా సమస్యలకు పార్టీల ఆవిర్భావమే పరిష్కారమా?

|

Dec 31, 2023 | 7:04 PM

ప్రజా సమస్యలకు పార్టీల ఆవిర్భావమే పరిష్కారమా? ఏపీలో వరుసబెట్టి కొత్త పార్టీల అవతరణ చూస్తుంటే.. అదే తీరుగా అనిపిస్తోంది. మొన్న జేపీ, నిన్న లక్ష్మీనారాయణ, ఇవాళ జొన్నవిత్తుల.. ఇలా వరుసబెట్టి పార్టీలు పుట్టుకొస్తుండటం వెనక ఆంతర్యమేంటి? ఇది ఎవరి వ్యూహం.. ఎవరికి లాభం? అసలు, పార్టీల స్థాపనకు లెక్కాపత్రం లేదా? ఈ కొత్త పార్టీలకు సంబంధించి హిస్టరీ ఏం చెబుతోంది.

Weekend Hour: ప్రజా సమస్యలకు పార్టీల ఆవిర్భావమే పరిష్కారమా?
Weekend Hour Debate
Follow us on

ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఆంధ్రప్రదేశంలో మరో కొత్త పార్టీ తెరమీదకు వచ్చింది. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలకు లిరిక్స్ అందించిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.. ‘జై తెలుగు పార్టీ’ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. దీంతో మరోసారి కొత్త పార్టీల చరిత్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఇలా ఒకరి తర్వాత ఒకరు.. ఇబ్బడిముబ్బడిగా పార్టీలు పెడుతుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అప్పట్లో జయప్రకాశ్‌ నారాయణ కూడా లోక్‌సత్తా పేరిట ఓ సంస్థను స్థాపించి ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. కానీ, ఎక్కువకాలం మనుగడ సాగించలేకపోయింది ఆ పార్టీ. మొన్నటికి మొన్న ఏపీ హైకోర్టు లాయర్‌ జడ శ్రవణ్ కుమార్ జై భీం పార్టీని స్థాపించారు. తాజాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. జై భారత్‌ నేషనల్‌ పేరిట కొత్త పార్టీని ప్రకటించారు.

ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి చెందిన జొన్నవిత్తుల .. కొత్త పార్టీని ప్రకటించడం చర్చనీయాంశమైంది. తెలుగు భాషా పరిరక్షణ కోసం, తెలుగు సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు జొన్నవిత్తుల ప్రకటించినా… ఇంకా స్పష్టతలేదు. కాకపోతే, ఈ కొత్త పార్టీల హంగామా దేనికనే చర్చ మాత్రం జనాల్లో మొదలైపోయింది.

ఈ పార్టీల స్థాపనంతా రాజకీయ అండదండల కోసమేనని కొందరంటుంటే.. ఈ రాజకీయపార్టీలను అడ్డుపెట్టుకుని ఆర్థికంగా వెనుకోసుకోవడానికేనని మరికొందరు అంటున్నారు. ఇలా పార్టీలు పెట్టి.. అధికారపక్షానికో, విపక్షానికో ఫేవర్‌ చేయడమే వీళ్లపని అనేవారూ లేకపోలేదు. అయితే, అంతిమంగా ప్రజా సమస్యలపై పోరాటానికే తమ ఎంట్రీ అంటున్నారు ఈ కొత్త పార్టీల అధినేతలు. అందుకు తగ్గట్టే నినాదాలూ ఇస్తున్నారు.. వినూత్నంగా జెండాలనూ సిద్ధంగా చేసుకుంటున్నారు.

ఇలా రాజకీయపార్టీ పెట్టిన అందరూ విజయవంతమయ్యారా? అంటే ఔనని చెప్పలేం. 1982లో టీడీపీ ఆవిర్భావం మొదలు.. 2014లో జనసేన దాకా.. తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు ఆవిర్భవించాయి. వాటిలో కొన్ని కొనసాగుతున్నాయి. మరికొన్ని తెరమరుగైపోయాయి.. ఇంకొన్ని ఉన్నాలేనట్టుగానే ఉన్నాయి. మరి, ఇప్పుడు పుట్టుకొస్తున్న ఈ పార్టీల ప్రభావమెంతనేదే ఆసక్తికరాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..