
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావంతో రాబోయే తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని అంచనా వేశారు. వాయుగుండం పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్యంగా పయనిస్తోంది. దీని కారణంగా ఏపీలో ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 6 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని స్పష్టం చేసింది. కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
వాయుగుండం బలపడిన క్రమంలో ఆగస్ట్ 19 వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట, పెదబయలుల పాడేరు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు ఖరీఫ్ పంటలకు మేలు చేకూరుస్తాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు వర్షపు నీరు పోలాల్లోకి వచ్చాయి. దీంతో రైతుల పంటకు నష్టం జరిగింది. అయితే ఎల్‌నీవో ప్రభావంతో ఏపీలో వర్షాలు ఎక్కువగా పడటం లేదు. ఇంకా లోటు వర్షపాతం నమోదవుతోంది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వాయుగుండం విస్తరించి ఉన్నందున.. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వాయుగుండం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారే అవకాశముందని స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా దుగ్గొండి, కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా ఖానాపూర్‌లో 2.8 సెంటీమీటర్లు, హన్మకొండ జిల్లా ఆత్మకూర్‌లో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వర్షాల సమయంలో హోర్డింగ్, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని సూచించింది.