Pawan Kalyan: పర్యావరణానికి హాని కలిగించని పరిశ్రమలు కావాలి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

| Edited By:

Jan 09, 2021 | 7:25 PM

సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేస్తామని, వాటి కోసమే పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడే..

Pawan Kalyan: పర్యావరణానికి హాని కలిగించని పరిశ్రమలు కావాలి... జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Follow us on

సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలు చేస్తామని, వాటి కోసమే పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడే ప్రశ్నిస్తామని అన్నారు. తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు పవన్‌ మద్దతు తెలిపారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మాటలు తూలనని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తనను సంస్కారవంతంగా పెంచారని ఆయన అన్నారు. వందలు, వేల కోట్లు సంపాదిస్తే నాయకులు సుఖంగా ఉంటారా? అని ప్రశ్నించారు.

సైద్ధాంతిక బలంతోనే…

సైద్ధాంతిక బలంతోనే రాజకీయాలు చేస్తున్నానని పవన్ అన్నారు. ప్రజలు తనకు ఓటు వేయకున్నా సిద్ధాంతాలతో కూడిన రాజకీయం చేస్తున్నా అని తెలిపారు. తనకు ఆస్తులు, అధికారాలు అక్కర్లేదని, ప్రజల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. కష్టపడి పని చేసి పిల్లలకు ఏమైనా ఇవ్వొచ్చని, కానీ, ఆరోగ్యం ఇవ్వగలమా? అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే పరిశ్రమలు వద్దని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.

పేదల కన్నీళ్లపై కార్పొరేట్లు కోట్ల సంపాదన….

తాను పారిశ్రామికీకరణ కోరుకునే వ్యక్తినే అని పవన్ తెలిపారు. కాలుష్యం దృష్ట్యా దివీస్‌ పరిశ్రమ వద్దని గతంలో సీఎం జగన్ డిమాండ్‌ చేశారని అన్నారు. అలాంటి పరిశ్రమలకు ఇప్పుడు ప్రభుత్వమే అనుమతులు ఇస్తోందని తెలియజేశారు. దివీస్ నుంచి పెద్దమొత్తంలో కాలుష్య జలాలు వస్తాయని, వాటి వలన సముద్ర జీవులు చనిపోతాయని స్పష్టం చేవారు. కాలుష్య జలాలను శుద్ధి చేసే విధానాలను ప్రోత్సహించాలని సూచించారు. అయితే కార్పొరేట్ వ్యవస్థలు పేదల కన్నీళ్లతో కోట్ల లాభాలు సంపాదిస్తే మంచిది కాదని అన్నారు.

కుల, కుటుంబ రాజకీయాలు చేయం…

జనసేన కుల, కుటుంబ రాజకీయాలు చేయదని పవన్ స్పష్టం చేశారు. వేల కోట్లు సంపాదించాలనే కోరిక తనకు లేదని అన్నారు. తాను సినిమాల ద్వారా కోట్లు సంపాదించానని తెలిపారు. సామాజిక ప్రభావం అంచనా వేయకుండా పరిశ్రమలకు భూములు ఇస్తారా? వైకాపాకు చెందిన రాంకీ ద్వారా అంచనా వేయించారు. దివీస్‌ పరిశ్రమ కాలుష్యం మత్స్య సంపదను నాశనం చేయదని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి వ్యాధులూ రావని హామీ ఇవ్వాలని అన్నారు. మన దేశంలో పర్యావరణ చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయని, ఇంత కాలుష్యం వెదజల్లుతుంటే పీసీబీలు ఏం చేస్తున్నాయని పవన్‌ ప్రశ్నించారు. కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులకు ఎవరు బాధ్యత వహిస్తారన్నారని అన్నారు. వ్యాధులు లేని సమాజాన్ని కోరుకుంటున్నామని, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను రానివ్వబోమని మీరే చెప్పారని సీఎం జగన్ ఇచ్చిన మాటను గుర్తు చేశారు. దివీస్‌ పరిశ్రమ వల్ల విపరీతమైన కాలుష్యం వస్తుంది. కాలుష్య జలాలు రావని దివిస్‌ యాజమాన్యం హామీ ఇవ్వగలదా అని పవన్‌ ప్రశ్నించారు.

ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు… వారిని విడుదల చేయాలి…

కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని పవన్ స్పష్టం చేశారు. అనేక మంది నుంచి వేల ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెట్టారని కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కాలుష్య పరిశ్రమలు తెస్తే ప్రజలకు ఎక్కడికి వెళ్లాలని అన్నారు. వ్యర్థాలను విడుదల చేయని పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా అకారణంగా అరెస్టు చేసిన 36 మందిని వెంటనే విడుదల చేయాలని పవన్ చేతులెత్తి కోరారు.

 

Also Read: AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 199 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా