Andhra Pradesh: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ.. చివరకు..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. చేతినిండా జీతం కానీ ఆమెకు విలాసాలే లోకం. కోట్లు సంపాదించాలనే ఆశతో లేడీ డాన్‌గా మారిన రేణుక అసలు కథ ఏంటి? ఆమెను ఎలా పట్టుకున్నారు? గంజాయితో ఆమెకున్న సంబంధం ఏంటీ..? తవ్వేకొద్దీ బయటపడుతున్న ఆమె నేర చరిత్ర గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra Pradesh: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ.. చివరకు..
Vizianagaram Lady Don Renuka Arrest

Edited By:

Updated on: Dec 27, 2025 | 8:54 PM

విజయనగరం జిల్లాలో లేడీ డాన్ వ్యవహారం సంచలనంగా మారింది. తక్కువ సమయంలో అక్రమ మార్గాల ద్వారా అధిక డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో జిల్లాకు చెందిన ఓ యువతి లేడీ డాన్ అవతారమెత్తింది. సంతకవిటి మండలం మోదుగులపేటకు చెందిన గడే రేణుక అనే యువతి ఒకప్పుడు హైదరాబాద్, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసేది. అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా వచ్చే నెలవారీ డబ్బు ఆమె విలాసాలకు సరిపోలేదు. దీంతో ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. అందుకోసం గంజాయి స్మగ్లింగ్ చేసే స్మగ్లర్‌తో పరిచయం పెంచుకుంది. అనంతరం ఆ స్మగ్లర్ సహాయంతో మరో ఏడుగురు స్మగ్లర్లును పరిచయం చేసుకుంది. అలా రేణుక మొత్తం ఎనిమిది మంది ముఠాతో కలిసి గంజాయి అక్రమ రవాణా వ్యాపారమే సరైన మార్గంగా ఎంచుకుంది.

ఈ అక్రమ దందాకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేంద్రంగా ఎంచుకొని అక్కడ నుంచి విజయనగరం జిల్లాలో విక్రయాలు జరిపేలా ప్లాన్ చేసింది. దీంతో నర్సీపట్నం నుంచి గంజాయిని తెచ్చి విజయనగరం, రేగిడి పరిసర గ్రామాల్లో గంజాయి విక్రయించేందుకు పక్కా ప్లాన్ చేసింది. అందులో భాగంగా గంజాయి రవాణాకు సిద్ధమైంది. ఆ సమయంలో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లేడీ డాన్ రేణుక గ్యాంగ్‌పై మెరుపుదాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.18.50 లక్షల విలువైన 74 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌‌పై దృష్టి సారించి లోతైన దర్యాప్తు చేపట్టారు.

ఈ లేడీ డాన్ రేణుక వ్యవహారంపై విజయనగరం పోలీసులు కూడా లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది. రేణుకపై గతంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు గంజాయి కేసుల్లో కీలక నిందితురాలిగా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గతంలో ఓ బాలుడు హత్య కేసులో కూడా నిందితురాలిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా రేణుక వ్యవహారంలో తవ్వేకొద్దీ ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే చదువుకున్న యువత అక్రమ మార్గాల వైపు మళ్లితే జీవితం నాశనం అవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.