
వైజాగ్, జూన్ 8: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రి మార్చురీకి మృతదేహాలను తరలించారు. విశాఖ స్టీల్స్ లో గతంలోనూ పలు మార్లు ప్రమాదాలు జరిగాయి. 2012 జూన్ 13న జరిగిన ప్రమాదం స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం. ఆక్సిజన్ ప్రెజర్ టెస్టింగ్ చేస్తుండగా పేలుడు సంభవించి.. ఏకంగా 19 మంది సజీవ దహనమయ్యారు. ఇందులో ఐదుగురు జీఎం స్థాయి సీనియర్ అధికారులు కూడా ఉన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. అక్కడి పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక చర్యల గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో సహయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో జరిగిన ఈ ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉండగా జరిగిన ఈ దుర్ఘటన కార్మిక వర్గానికే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం, అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు. కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి పరిశ్రమ యాజమాన్యం బాధ్యత అని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉక్కు ద్రవం లీకై పలువురు కార్మికులు గాయపడిన ఘటన బాధాకరమని వ్యాఖ్యానించారు. గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.