మాజీ మంత్రి అవంతి((Avanti Srinivas) శ్రీనివాస్ చిక్కుల్లోపడ్డారు. ఆయనపై బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రసీదు ఇచ్చి పంపించారు. ఇటీవల పద్మనాభం మండలం కోరాడలో రైతు భరోసా బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తన సమస్య పరిష్కరించాలని.. వేదిక ముందు ఆందోళన చేశారు. ఆయనను సముదాయించాల్సిన అవంతి.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఘటనపైనే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. కులం పేరుతో వ్యక్తిని దూషించడం ఏంటని నిలదీస్తున్నాయి. మాజీ మంత్రి అవంతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బ్రాహ్మణ సంఘాల నేతలు.
మే16న విశాఖ జిల్లా పద్మనాభ మండలం, కోరాడ గ్రామంలో రైతు భరోసా సభ జరిగింది. ఈ సభలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ బ్రాహ్మణులను ఉద్దేశిస్తూ.. పంతులూ, నీ అంతు చూస్తా అంటూ కులదూషణ చేశారని బ్రాహ్మణ సంక్షేమ వేదిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించినట్లుగా కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాజానికి సేవ చేసే ప్రజాప్రతినిధిగా ఉన్న వ్కక్తి ఇలా మాట్లాడటం సబబుకాదంటూ బ్రాహ్మణ సంఘాలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి పునరావృత్తం అయితే బ్రాహ్మణ సంఘాలు చూస్తూ ఊరుకోమని అంటున్నారు. ఐపీసీ 153(C), 509(A) ప్రకారం మాజీ మంత్రి అవంతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే రాజకీయ పార్టీలు, వివిధ సామాజికవర్గ సంఘాలు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ ఫిర్యాదు కూడా నమోదు కావడంతో చిక్కుల్లో పడ్డారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.