విశాఖపట్నం, జులై 30: ట్రాన్స్ జెండర్లు భక్తిశ్రద్ధలతో ముర్గీ మాత పండుగ నిర్వహించారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా 2వేల మంది ట్రాన్స్ జెండర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించారు. ముగింపు ఉత్సవాన్ని రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముర్గీ మాత అంటే ట్రాన్స్ జెండర్ల ఆరాధ్య దేవత. తమ కమ్యూనిటీకి ముర్గీ మాత దైవంగా కొలుస్తుంటారు. ముర్గి మాత ఉత్సవం సమయంలో ట్రాన్స్‌జెండర్స్ అంతా ఒక్కచోట చేరుతారు. భక్తిశ్రద్ధలతో ముర్గిమాతకు పూజలు చేస్తారు. నిష్టతో దీక్షలు చేసి అమ్మవారికి పళ్ళు ఫలహారాలు నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. కమ్యూనిటీలో కొత్తగా చేరేవారిని ఆహ్వానిస్తూ సంబరాలు చేసుకుంటారు.
-ముర్గీ మాత పండుగలో ప్రధాన ఘట్టం పూజ. తమ ఇష్ట దైవాన్ని ఆరాధించే ట్రాన్స్ జెండర్లు.. ముర్గీ మాతకు నిష్ఠతో పూజ చేస్తారు. సమాజమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. సమాజం బాగుంటేనే అందులో తాము కూడా సుఖంగా ఉంటాం అనేది వారి భావన. ఎందుకంటే తమకు దానం చేసే వాళ్లంతా సుభిక్షంగా ఉంటేనే.. తమ జీవనం ముందుకు సాగుతుందనేది వాళ్ల మాట. అందుకే.. ఈ పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తారు ట్రాన్స్ జెండర్లు. అందరూ ఒక్క చోట చేరి పూజలు చేస్తారు. కష్ట సుఖాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. అందరూ కలిసి విందు ఆరగిస్తారు. వేడుకను సంతోషంగా జరుపుకొని ఆడిపాడతారు.
ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ట్రాన్స్ జెండర్స్ ప్రొటెక్షన్ నోడల్ ఆఫీసర్, దిశ ఏసీపీ వివేకానంద హాజరయ్యారు. ఏపీ సీఐడీ విభాగం తయారు చేయించిన ‘స్వాభిమాన్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ల రక్షణ, సంరక్షణ, సంక్షేమం కోసం ఏపీ పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాల్ని వివరించారు. ట్రాన్స్ జెండర్ల సమస్యల పరిష్కారానికి, రక్షణ కోసం ఇప్పటికే 1090 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారని తెలిపారు ఏసీపీ వివేకానంద .
ట్రాన్స్ జెండర్లు విలువలతో కూడిన జీవనం సాగించాలని కోరారు ఏసీపీ వివేకానంద. సమాజానికి ఉపయోగపడేలా పలు మంచి కార్యక్రమాలు చేపట్టాలని, అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. హిజ్రాల చట్టం`2019 పై వివరిస్తూ, ట్రాన్స్‌జెండర్స్ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్ జెండర్లు తమ సమస్యలను వివరించారు. ముర్గీమాతా పండగలో సుమారు 2వేల మంది ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..