కృష్ణా జిల్లా అవనిగడ్డ చల్లపల్లి మండలంలోని బీసీ హాస్టల్‌లో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న విద్యార్థి దాసరి ఆదిత్య(8) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం హాస్టల్ బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో శవమై కనిపించాడు. వెంటనే అక్కడి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి విషయం చెప్పడంతో.. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆదిత్య మెడపై కత్తితో కోసినట్లుగా ఆనవాలు ఉండటంతో.. ఎవరైనా హత్య చేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తమ కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు భోరున విలపించారు. బాగా చదువుకుంటాడని హాస్టల్‌లో చేర్పిస్తే.. ఇలా శవమై కనిపిస్తాడని ఊహించలేదని ఆదిత్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఎవరితోనూ ఎలాంటి ఆస్తి గొడవలు లేవని వారు చెబుతున్నారు. దీంతో ఈ కేసు ఓ మిస్టరీగా మారింది.