తెలంగాణలో రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని రాష్ట్ర ఎంపీటీసీల కార్యవర్గ సమావేశం ధ్వజమెత్తింది. బాగ్‌లింగంపల్లిలో గడీల కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.
తెలంగాణలో ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు, విధులు, అధికారాలు కల్పించాలని ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. ఎంపీటీసీలు ఎన్నికైన నాటి నుంచి నిధులు కేటాయించకపోవడంతో కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా, మండల పరిషత్ సభ్యుల ప్రమేయం లేకుండా నేరుగా గ్రామాలకు వస్తుండటం తో ఎంపీటీసీలకు అగౌరవంగా ఉందన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ఎంపీటీసీలు కూర్చునేందుకు ఛాంబర్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు ఉన్న గౌరవం కూడా ఎంపీటీసీ లకు లేకపోవటం విచారకరమన్నారు.
73వ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ 243జీ 11వ షెడ్యూల్ ప్రకారం తమకు నిధులు, విధులు, అధికారాలు బదలాయించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి ఎంపీటీసీకి ఏటా రూ.20లక్షల నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్, అగ్రికల్చర్, మార్కెటింగ్, మండల ల్యాండ్ అసైన్‌మెంట్ కమిటీలు, జిల్లా ప్రణాళికా సంఘాల్లో ఎంపీటీసీలను సభ్యులుగా నియమించాలన్నారు. పింఛన్ దరఖాస్తులపై ఎంపీటీసీలకు సంతకం చేసే అధికారం కల్పించాలని కోరారు.
న్యాయబద్ధమైన 33 డిమాండ్లను పరిశీలించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ గతంలోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు రాష్ట్ర ఎంపీటీసీల సంఘం తరపున విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఎంపీటీసీలకు రూ.5వేల వేతనం పెంచారని, అందుకు రుణ పడి ఉంటామన్నారు.