
ఓ అరుదైన వింత జంతువు సింగరేణి కార్మికుల కంటపడింది. అడవి జంతువును గుర్తించిన సింగరేణి కార్మికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ వన్యప్రాణిని పరిశీలించిన అటవీశాఖ అధికారులు అరుదైన జాతికి సంబంధించినదిగా వెల్లడించారు. అనంతర ఆ జంతువును కిన్నెరసాని జూ పార్క్ కు తరలించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి జే వి ఆర్ ఓపెన్ కాస్ట్ సమీపంలో అరుదైన జంతువు కనిపించింది. సమీప అటవీ ప్రాంతం నుండి వచ్చిన జంతువును సత్తుపల్లి పట్టణ శివార్లలోని ఎన్టీఆర్ కాలనీ వద్ద టిప్పర్ డ్రైవర్ గుర్తించాడు. కుందేలును పోలిన ఆనవాళ్లు ఆ జంతువుకు ఉండటంతో దానిని ఇంటికి తీసుకువెళ్లాడు. అనంతరం స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు ఆ జంతువుని పరిశీలించి అతి అరుదైన మూషిక జింక గా దాన్ని గుర్తించారు. మూషిక జింకకు సుమారుగా మూడేళ్ల వయసుంటుందని అధికారులు అంచనా వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూషిక జింక ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని అటవీ ప్రాంతానికి తరలించారు.
గతంలో కూడా సింగరేణి ఓపెన్ కాస్ట్ వల్ల అనేక జంతువులు అడవుల నుండి జనావాసాల్లోకి రావడంతో ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకుని జూ పార్కు కు తరలించిన ఘటనలు ఉన్నాయి.