ఏపీలోని 25 ఎంపీ సీట్లలో విశాఖ సీటుకు ఉండే క్రేజు మోజు నెక్ట్స్ లెవెల్. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి రాజకీయ నేతలు తహతహలాడుతుంటారు. అందులోనూ వలస పక్షులదే ఇక్కడ హవా. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 17 లక్షల ఓట్లు ఉన్నాయి. విశాఖ నగరంలోని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, ఎస్ కోట నియోజకవర్గాలతో కలిసి ఉండే విశాఖ లోక్‌సభ సీటులో స్థానికేతరులదే పెత్తనం. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ….టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే విశాఖ ఎంపీ సీటులో ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2009 దాకా ఇక్కడ కాంగ్రెస్ హవా సాగింది. తర్వాత 2014లో టీడీపీ, జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. 2019లో ఈ సీటును వైసీపీ దక్కించుకుంది.
విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండడం, నేవీ, పోర్ట్, స్టీల్ ప్లాంట్ , బీహెచ్‌ఈఎల్ లాంటి సంస్థలలో ఉత్తరాది రాష్ట్రాల వాళ్లు ఎక్కువగా ఉండడం, కాస్మోపాలిటన్ సిటీ కూడా కావడంతో ఇక్కడ నుంచి పోటీకి బీజేపీ ఆసక్తి చూపుతోంది. ఒక వేళ టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంటే ఆ పార్టీకి విశాఖ ఎంపీ సీటు కేటాయిస్తారంటున్నారు. ఇక్కడ టీడీపీ, జనసేనకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీంతో ఈసారి విశాఖ నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. గతంలో విశాఖ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసి ఉండడంతో ఇక్కడ నుంచి మరోసారి బరిలో దిగాలని పురంధేశ్వరి చూస్తున్నారట.
ఇక బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్‌లు కూడా విశాఖ కుర్చీలో కర్చీఫులు వేశారని చెబుతున్నారు. త్వరలో వాళ్ల రాజ్యసభ పదవీ కాలం ముగుస్తూ ఉండడం, మళ్లీ వచ్చే అవకాశాలు దాదాపు లేకపోవడం తో ఇద్దరూ విశాఖ పార్లమెంట్ నుంచి లోక్ సభకు వెళ్ళాలన్న ఆలోచనలో ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ముఖ్యంగా సీఎం రమేష్ విశాఖ నుంచి పోటీకి ఎక్కువగా మక్కువ చూపుతున్నారట. టీడీపీ సహకారం, ఆర్థిక బలం ఉన్న నేత కావడం, వెలమ సామాజిక వర్గానికి విశాఖలో పట్టు ఉండడం తనకు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. దీనికితోడు వీలైనప్పుడలా విశాఖకు వచ్చి పార్టీ శ్రేణులతో మమేకం అవుతున్నారు.
ఇక బీజేపీకి చెందిన మరో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అయితే దాదాపు ఏడాదిన్నరగా విశాఖనే తన కార్యక్షేత్రంగా మార్చుకుని పని చేస్తున్నారు. టార్గెట్ విశాఖ ఎంపీ సీటు అంటున్నారట. దీనికోసం నగరంలోని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపిస్తూ నగర పౌరుల మన్ననలు పొందుతున్నారుట. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్…. అనేక బీసీ కులాలకు ఓబీసీలుగా గుర్తింపు ఇవ్వడం దగ్గర నుంచి తూర్పు కాపులకి బీసీ రిజర్వేషన్ అంశంపై ఉన్న అభ్యంతరాల పరిశీలన, వారికి ధృవీకరణ పత్రాల జారీ లాంటి అవసరమైన చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల ఏర్పాటుతో దశాబ్దాల క్రితం రహదారులు మూసుకుపోయిన అనేక గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో బలం పెంచుకుంటున్నారు. ఇక ప్రతి ఎంపీ…ఒక లోక్‌సభ సీటులో పనిచేయాలన్న బీజేపీ ఫార్ములా ప్రకారం విశాఖను కార్యక్షేత్రంగా ఎంచుకుని పని చేస్తున్నారు.
బీజేపీ నుంచి పురంధేశ్వరి, జీవీఎల్, సీఎం రమేష్‌లు…విశాఖ కుర్చీలో కర్చీఫ్ వేస్తే…టీడీపీ నేతలు కూడా ఇక్కడ్నించి పోటీకి సై అంటున్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి భరత్…విశాఖ పార్లమెంటు నియోజకవర్గాన్నే నమ్ముకుని రాజకీయాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పార్లమెంటుకు తప్ప అసెంబ్లీకి పోటీ చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నారట భరత్. ఒకవేళ పొత్తులో భాగంగా విశాఖ సీటును బీజేపీకి కేటాయిస్తే భరత్ రాజకీయ భవిష్యత్ ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..