రాష్ట్రంలో ఆర్థిక పురోగమనం కొనసాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో తెలంగాణ గౌడ సంఘం నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభకు టీ మంత్రులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు.. శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గౌడ కులస్థుల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ పెట్టాలని సీఎంని అడిగితే… ఇప్పటికే డెవలప్ స్కిల్స్ ఉన్న వారి పరిస్థితి ఏంటంటూ సీఎం అడిగారని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో అనేక కులవృత్తులు ఉన్నాయని.. వాటి అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే పాలన చేతనవుతుందా? అని చాలా మంది ఎద్దేవా చేశారని.. కానీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘హాట్సాఫ్ కేసీఆర్’ అన్నారని గుర్తు చేశారు. ఇటీవల దిశ ఘటనకు సంబంధించి నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనను ఉద్దేశించి ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ హ్యాట్సాఫ్ చెప్పారు.