మార్కెట్లో ఉల్లిధరలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. ఏకంగా క్వింటాల్ ఉల్లి ధర రూ.6,700కి పలికింది. పెరిగిన ధరలతో.. ఉల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. వినియోగదారులు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు రూ.10 వేల వరకూ పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఉల్లి ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో.. కర్నూలు ఉల్లికి.. రికార్డు స్థాయి ధర వస్తోంది.
గతేడాది ఇదే సమయంలో.. క్వింటాల్ ఉల్లి ధర 100 రూపాయలే పలికింది. అయితే.. ఈ ఏడాది పరిస్థితులు మారిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లిని రూ.6 వేలకు పైగానే.. దళారులు కొనుగోలు చేయడంతో రైతుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి.
మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో పండించే ఉల్లి దేశీయ మార్కెట్‌తో పాటు.. విదేశీ మార్కెట్‌లోనూ.. ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఆగష్టు నుండి అక్టోబర్ వరకూ.. వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట దెబ్బతింది. ఈ ప్రభావంతో ఉల్లి పాయల ధర దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. కానీ.. రైతులకు మాత్రం లాభం చేకూరింది. మొత్తానికి ఈ ఏడాది ఉల్లి.. రైతులకు సిరులు కురిపిస్తోంది. దిగుబడి తక్కువైనా.. ధర ఉండటంతో.. పండిన పంటతో గిట్టుబాటు అయ్యిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు.
ఒకవైపు ఉల్లిపాయల రేటు ఎక్కువయి.. జనాలు కన్నీరు కారుస్తుంటే.. మార్కెట్లో మంచి ధర పలకడంతో రైతులకు కాసుల వర్షం కురుస్తోంది.