ఏపీలో రద్దుల ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు నీటి పారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విజయవాడ అవనిగడ్డలో మండల పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు కుమార్తె వివాహం సందర్భంగా ఇక్కడకు వచ్చిన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో పోలీసులతో వైసీపీ నాయకులు కుమ్మకై అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. సాక్షి పేపర్ అబద్దాల పేపర్ అని సాక్ష్యత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారంటూ వివరించారు. చంద్రన్న భీమా, రంజాన్‌తోఫా, క్రిస్మస్ కానుక వంటి అనేక పథకాలను రద్దు చేశారని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో బెల్టుషాపుల నిర్వహణ మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో మొబైల్ మద్యం బెల్ట్ షాపులు విజృంభించాయని, వైసీపీ వ్యక్తులకు లిక్కర్ షాపులలో ఉద్యోగాలు కల్పించి, వారితో దొంగ వ్యాపారం చేయిస్తున్నారని అన్నారు. ఏప్రిల్ 1 నుండి J-TAX రాబోతోందని, దీనివల్ల పేదలకు డబుల్ భారం పడనుందని చెప్పారు.
మరోవైపు ఎన్నడూ లేని విధంగా ఉల్లిపాయల కోసం తొక్కిసలాట జరుగుతోందని అన్నారు. అందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.
అమరావతిని చంపేశారని, పోలవరాన్ని పడుకోబెట్టారని అన్నారు. రాజధాని అని కాసేపు అంటారు, స్మశానం అని మళ్లీ కాసేపు అంటూ,.. రైతులలో అభద్రతా భావం కల్పిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, వైసీపీ మంత్రులందరూ బూతులు మాట్లాడటంలో పీహెచ్‌డీ పూర్తి చేశారని దేవినేని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రికి మీడియా ముందుకు రావాలంటే భయం అంటూ వ్యాఖ్యనించారు. ఏడునెలల కాలంలో ఎన్నాడూ సీఎం జగన్ మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. శాసన సభలో వైసీపీ నాయకులు చెప్పిన అసత్యాలన్నీ ప్రజల వద్దకు తీసుకు వెళతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు.