ఏపీలో వాలంటీర్లపై వరుస దాడులు.. తాజాగా మరో రెండు చోట్ల..!

| Edited By: Pardhasaradhi Peri

May 24, 2020 | 2:44 PM

ఏపీలోని చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వరస దాడులు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న శ్రీకాళహస్తిలో వాలంటీర్లపై టీటీడీ కార్యకర్తలు దాడికి పాల్పడగా, ఈ రోజు పలమనేరు, కలకడ మండలాల్లో వాలంటీర్లపై దాడులు జరిగాయి.

ఏపీలో వాలంటీర్లపై వరుస దాడులు.. తాజాగా మరో రెండు చోట్ల..!
Follow us on

ఏపీలోని చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వరస దాడులు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న శ్రీకాళహస్తిలో వాలంటీర్లపై టీటీడీ కార్యకర్తలు దాడికి పాల్పడగా, ఈ రోజు పలమనేరు, కలకడ మండలాల్లో వాలంటీర్లపై దాడులు జరిగాయి. పలమనేరు మున్సిపాలిటీలో వాలంటీర్ సౌమ్యపై వైసీపీ మండల కార్యదర్శి సావిత్రమ్మ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తన ఆదేశాలను, మాటలను ఖాతరు చేయలేదని సౌమ్యపై సావిత్రమ్మ చేయి చేసుకున్నారు. మాట వినకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ బెదిరించినట్లు సమాచారం. దీంతో జిల్లా అధికారులు, పోలీసులకు సౌమ్య ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరోవైపు కలకడ మండలంలోనూ వాలంటీర్‌పై దాడి జరిగింది. నవాబుపేట గ్రామ సచివాలయ వాలంటీర్‌గా పనిచేస్తున్న జ్యోష్న, ఆమె కుటుంబంపై కొందరు దాడి చేశారు. గ్రామంలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడం లేదని జ్యోష్న ప్రశ్నించడంతో ఆమెతో పాటు కుటుంబంపై శంకర్ నాయుడు, అతడి అనుచరులు కర్రలు, రాళ్లతో దాడులు జరిపారు. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో కలకడ పోలీస్ స్టేషన్‌లో శంకర్ నాయుడు, అనుచరులపై జ్యోష్న ఫిర్యాదు చేశారు. కాగా  ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న ఉద్దేశ్యంతో అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: గుడ్ న్యూస్: టీటీడీ కళ్యాణ మండపాల్లో.. శ్రీవారి లడ్డూ ప్రసాదం..