Bharat bandh on March 26 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, కొత్త సాగు చట్టాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన విశాఖ కార్మిక సంఘాలు పిలుపు నిచ్చిన భారత్ బంద్ కు ఏపీ సర్కారు మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా 26వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు వైసీపీ మద్దతు ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే, నిరసనలు శాంతియుతంగా నిర్వహించాలని మంత్రి కోరారు.
అటు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా బంద్ కు మద్ధతునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ ఏకమై దేశంలో జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలను వ్యతిరేకించాలని ఆయన మొన్న రాజమండ్రిలో పిలుపు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిరసన ఉద్యమంలో భాగంగా పిలుపునిచ్చిన భారత్ బంద్ కు సహకరించాలని ఉండవల్లిని కలిసి విన్నవించారు కమ్యూనిస్టు నేతలు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఉండవల్లి.. స్టీల్ ప్లాంట్ కు మద్దతుతుగా జరుగుతున్న బంద్ కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, భారత దేశంలో కమ్యూనిస్టులు లేకుంటే.. పేదల సమస్యల గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు కనుమరుగై పోతాయన్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు.