Vizag: ‘కుదిరితే విశాఖను క్యాపిటల్ చేయండి.. లేదంటే మా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయండి’

|

Dec 31, 2022 | 8:23 AM

ఏపీలో రాజధాని నినాదం రగులుతుంది. కుదిరితే క్యాపిటల్.. కుదరదంటే రాష్ట్రం ఇవ్వాలంటూ మంత్రి ధర్మాన ప్రత్యేక రాగం అందుకున్నారు. మరోసారి ఉత్తరాంధ్రవాసులను మోసపోనివ్వం అంటూ గట్టిగా చెబుతున్నారు.

Vizag: కుదిరితే విశాఖను క్యాపిటల్ చేయండి.. లేదంటే మా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయండి
Andhra Minister Dharmana Prasad Rao
Follow us on

నిన్నటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్లుగా ఉంది రాజధాని వివాదం. మూడు రాజధానుల ఏర్పాటే లక్ష్యమంటోంది వైసీపీ ప్రభుత్వం. ఈ క్రమంలో కోర్టు కేసులు, వివాదాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖను పరిపాలన రాజధాని చేయాలంటూ నిన్నటి వరకు వాయిస్ వినిపించిన ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు.. ఇప్పుడు అంతకు మించి గొంతెత్తుతున్నారు. కుదిరితే విశాఖను క్యాపిటల్ చేయండి.. లేదంటే మా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు లేకపోతే.. హైదరాబాద్ తరహా పరిస్థితులు రిపీట్ అవుతాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి ఎలా కట్టుబట్టలతో ఏపీకి వచ్చామో, అలాంటి పరిస్థితితే భవిష్యత్తులో రావొచ్చన్నారు ధర్మాన.

అమరావతి ప్రాంత రైతులు పాదయాత్రను మధ్యలో వదిలేయడం పట్ల ధర్మాన చురకలు అంటించారు. అరసవల్లికి వస్తామని చెప్పి చివరికి ఢిల్లీ వెళ్లిపోయారు. హైకోర్టు ఆధార్ కార్డులు అడగటం వల్లే యాత్రను మధ్యలో ఆపేయాల్సి వచ్చిందని ఆరోపించారు ధర్మాన. నిజమైన రైతులే అమరావతి పాదయాత్రలో పాల్గొని ఉంటే ఆధార్ కార్డులను ఎందుకు చూపించలేకపోయారని నిలదీశారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. రాజధాని ఏర్పాటుతో ప్రైవేటు సంస్థలు, పెట్టుబడులు భారీగా వస్తాయి, భవిష్యత్ తరాలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు ధర్మాన. ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబును ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారాయన.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి