
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ తన మానవతా దృక్పథాన్ని చాట్టుకున్నారు. కలెక్టర్ రేట్‌కు వచ్చిన ఆయన తన వాహనం దిగి మెట్లు ఎక్కుతుండగా, వాలంటీర్ సహాయంతో లిఫ్ట్ వైపు వెళ్తున్న ఓ దివ్యాంగుడిని చూశారు. వెంటనే ఆగి, స్వయంగా ఆ దివ్యాంగుడి వద్దకు వెళ్లిఏమైంది.. మీ సమస్య ఏమిటి? అంటూ ఆప్యాయంగా ఆరా తీశారు. అయితే అతని పక్కనే ఉన్న తల్లిదండ్రులు తమది భీమిలి మండలం చిప్పాడ గ్రామమని.. మానసిక వికలాంగుడైన తమ కుమారుడు జి. రాంబాబుకు ప్రస్తుతం వికలాంగుల కోటా కింద నెలకు రూ. 6,000 పింఛను అందుతోందని తెలిపారు.
అయితే రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమకు, రాంబాబు పోషణకు ప్రస్తుతం అందుతున్న మొత్తం సరిపోవడం లేదని అతని తల్లిదండ్రులు కలెక్టర్‌కు వివరించారు. తమ కుమారుడిని బెడ్ రిడెన్ కేటగిరీ కింద పరిగణించి నెలకు రూ. 15,000 పింఛను మంజూరు చేయాలని కోరారు. వారి గోడును సానుభూతితో విన్న కలెక్టర్.. వీలైనంత వేగంగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా, దివ్యాంగుడైన రాంబాబును ఇకపై ఇలా శ్రమకోర్చి కలెక్టరేట్‌కు తీసుకురావొద్దని.. సమస్య పరిష్కారానికి అధికారులే మీ ఇంటికి వస్తారని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. తాము ప్రత్యేకంగా అర్జీ ఇచ్చేందుకు ఎదురుచూడాల్సిన పనిలేకుండా, కలెక్టరే తమ వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకోవడంపై రాంబాబు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.