
విశాఖ ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యనారాయణ వర్మ భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈనెల 17వ తేదీన అతని ఇంట్లో ఒక చోరీ జరిగింది. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో.. ఇంట్లోకి చొరబడింది ఓ మహిళా దొంగ. వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి.. చేతికి ఉన్న బంగారు గాజులు ఎత్తుకెళ్లింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో.. ఓ మహిళ మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడినట్టు గుర్తించారు. బాధితురాలిని పోలీసులు విచారించారు. దీంతో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. తెలిసిన వారి పని అయి ఉంటుందని అనుమానించారు. ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఇంట్లో ఎవరైనా పని చేస్తున్నారా నేను దానిపై ఆరా తీశారు.
పద్మ అనే మహిళ వృద్ధురాలికి కేర్ టేకర్ పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎరుపు రంగు స్కూటీతో ఆమె ఇంటికి వచ్చేదని నిర్ధారించుకున్నారు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లేసరికి శివాజీ పాలెంలో ఆమె ఇంటి వద్ద ఎరుపు రంగు స్కూటి ఉండడాన్ని చూశారు. సీసీ కెమెరాల్లో కనిపించిన దుస్తులు సైతం ఆమె ఇంట్లో ఉన్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారించేసరికి.. అసలు విషయం తేలిపోయింది. కేర్ టేకర్‌గా పనిచేసిన పద్మ.. దొంగ అవతారం ఎత్తి మాస్క్ ధరించి దోపిడీకి పాల్పడినట్టు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి రెండు లక్షల విలువైన రెండు బంగారు గాజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.