Venkaiah Naidu: రాజకీయ పార్టీల మేనిఫెస్టోలకు చట్టబద్ధతపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజలకు ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమైనవిగా ఉండాలన్నారు. మున్సిపాల్టీల నుంచి పార్లమెంట్ వరకు ప్రజాప్రతినిధుల వాడుతున్న భాషపై సమీక్ష జరగాలన్నారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జడ్పీ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు వెంకయ్య. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దివంగత మాజీ జడ్పీ ఛైర్మన్ పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఛైర్మన్ అంటే ఆయనే అనేలా 27 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పిన్నమనేని కోటేశ్వరరావు పనిచేశారని చెప్పారు. అంతకాలం జడ్పీ ఛైర్మన్‌గా పనిచేయడం సాధారణ విషయం కాదన్నారు. ఆదర్శ ప్రజానాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు పరిపూర్ణంగా కలిగిన వ్యక్తి పిన్నమనేని అని ఉపరాష్ట్రపతి కొనియాడారు. పార్టీ మారకుండా పార్టీలకు అతీతంగా పనిచేశారని.. దీన్ని నేటితరం నేతలు నేర్చుకోవాలని సూచించారు. రాత్రి పడుకునే ముందు ఈరోజు ఏం చేశామనేదాన్ని ప్రతి నాయకుడూ సమీక్షించుకోవాలన్నారు. కుల, మత, వర్గాల పేరుతో జాతిని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది మంచిది కాదని చెప్పారు
రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు బాధ్యతాయుతంగా.. ఆచరణ సాధ్యమైనవే ఉండాలని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అన్ని పార్టీలూ గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయాల్లో స్థాయి తగ్గిపోతోందనే భావన పెరుగుతోందని.. నేతలు తాము మాట్లాడే భాషను సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రజా ప్రతినిధుల్లో హుందాతనం తగ్గుతోందన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి రాజకీయంగా స్థిర కాలం రాణిస్తారన్నారు. వర్ధంతులు, విగ్రహ ఆవిష్కరణలు వల్ల వాళ్లకు ఒరిగేది ఏమి ఉండదని, వారి సిద్ధాంతాలను, స్ఫూర్తి ని ప్రజలకు తెలియచేయాలని సూచించారు. చట్ట సభలలో శాసన సభ్యులు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని వెంకయ్య అన్నారు. వారసత్వంతో కాదు జవసత్వాలతో రాజకీయాలలోకి రావాలని సూచించారు. కులం కన్న గుణం మిన్న అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.